శాసనసభకు 2023 చివర్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి ఘన విజయం సాధిస్తుందని, 98కి పైగా స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడుతుందని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన లేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతో కలిపి జరిగితే నష్టమనే భావనతో గతంలో ముందస్తుకు వెళ్లామని, ఈసారి అలాంటి అవసరం లేదన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెరాస ప్రభుత్వం ఏడేళ్లలోనే సాధించి చూపిందని చెప్పారు. వచ్చే 26 నెలలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. పార్టీని, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిచి కేంద్రంలోనూ క్రియాశీలకపాత్ర పోషిస్తామన్నారు. ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా నవంబరు 15న 10 లక్షల మందితో వరంగల్‌లో విజయగర్జన సభను నిర్వహిస్తామని.. తమపై మొరిగేవారి నోళ్లు మూయిస్తామని స్పష్టం చేశారు. ఆ సభకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్ష సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన అంశాలిలా ఉన్నాయి..‘‘తెరాస ఏడేళ్ల పాలన అద్భుతంగా సాగింది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెరాస.. రాజకీయ పార్టీగా లక్ష్యాలను పూర్తి చేసుకుంది. ఝార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం ముక్తి మోర్చా పేరిట శిబుసొరేన్ ఉద్యమ సంస్థను ప్రారంభించగా.. దానికి ఆదరణ లభించలేదు. దీంతో సొరేన్ దానిని పార్టీగా మార్చి రాష్ట్రాన్ని సాధించారు. ఆ అనుభవాన్ని కరీంనగర్ సభలో ఆయన నాకు చెప్పడంతో తెరాస పంథాను మార్చాం. రాజకీయ వ్యవస్థతో గాంధేయమార్గంలో, అంబేడ్కర్ స్ఫూర్తితో శాంతియతంగా ఉద్యమించి, వ్యూహాత్మకంగా తెలంగాణ సాధించాం.
నా మదిలో ఎన్నో ఉన్నాయి
అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానాను బలోపేతం చేశాం. అన్నదాతలకు అండగా నిలిచాం. కరెంటు వెలుగులు తెచ్చాం. సంక్షేమాన్ని సంపూర్ణం చేశాం. ఎస్సీల కోసం దళితబంధు తెచ్చాం. ఈ పథకానికి వెచ్చించేది రూ. 1.70 లక్షల కోట్లే. వచ్చే ఏడేళ్లలో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. దాంతో అన్ని వర్గాలకు ఆదరువవుతాం. ఇంకా నా మదిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కరోనా వల్ల రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని నష్టపోవడంతో కొన్ని వీలు కాలేదు. ఎప్పటికైనా అన్ని వర్గాల ఆర్థిక సాధికారిత సాధిస్తాం. త్వరలో రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ వారి కోసం గురుకులాలు ప్రారంభిస్తాం.
హుజూరాబాద్‌లో పాగా వేస్తాం
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుంది. భాజపాపై 12.5 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు అన్ని సర్వేలు తేల్చాయి. ఎన్నికల నాటికి అది మరింత పెరుగుతుంది. 26 లేదా 27న ప్రచారానికి రావాలని స్థానిక నేతలు కోరారు. రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం.
సింహగర్జనను మించాలి
వరంగల్‌లో జరిగే విజయగర్జన సభ కరీంనగర్‌లో 2001లో నిర్వహించిన సింహగర్జన సభను మించాలి. తెరాసపై ప్రజాభిమానాన్ని దేశం మొత్తం చాటేలా జరగాలి. ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు ఉండాలి. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సభకు హాజరయ్యేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి. సభకు వచ్చేవారికి పార్టీపరంగా బస్సులు ఏర్పాటు చేస్తాం. అన్ని కండిషన్‌లో ఉండే బండ్లే పెట్టాలి. డొక్కు బండ్లను తేవొద్దు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రూట్ మ్యాప్ ఇవ్వాలి.
పిలిచినవారే ప్లీనరీకి రావాలి
తెరాస 60 లక్షలమందికి పైగా కార్యకర్తలతో దేశంలోనే అత్యుత్తమ పార్టీల్లో ఒకటిగా ఉంది. ఇటీవలే పార్టీ గ్రామ, మండల కమిటీ ఎన్నికలయ్యాయి. 6,500 మంది ఎన్నికయ్యారు. వారిని ప్లీనరీకి ఆహ్వానిస్తున్నాం. పిలవని వారెవ్వరూ రావద్దు. పార్టీ అధ్యక్ష ఎన్నికల అనంతరం 8 నెలల పాటు కమిటీలన్నింటికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. త్వరలో హైదరాబాద్, వరంగల్‌లోనూ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తాం. అవి కార్పొరేట్ తరహాలో ఉంటాయి. తెరాసకు రూ.403 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయి. ఏటా రూ. రెండుకోట్ల వడ్డీ వస్తుంది. పార్టీకి లోటు లేదు’’ అని సీఎం చెప్పారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్‌సభాపక్ష నేత నామా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
కేంద్రంలో చక్రం తిప్పుతాం
"వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదు. మనం అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా ఉంటాం. కేంద్రంలో అధికారం కోసం ఇతర పార్టీలకు మన అవసరం ఉంటుంది. అప్పుడు మనమే చక్రం తిప్పుతాం."
- ముఖ్యమంత్రి కేసీఆర్
ఈసారి పూర్తికాలం ఉంటాం
"పార్లమెంటు ఎన్నికలతో కలిపి శాసనసభ ఎన్నికలు జరిగితే నష్టపోతామనే ఉద్దేశంతో పోయినసారి ముందస్తుకు వెళ్లాం. ఈసారి శాసనసభ గడువు ముగిసే వరకు ఎన్నికలుండవు. గత ఎన్నికల మాదిరే ఈసారీ ఎమ్మెల్యేల పనితీరుపై గ్రేడింగ్ తీయించాం. ఇందులో చాలామంది ఏ -గ్రేడులో ఉన్నా... కొంతమంది బీ, సీ- గ్రేడుల్లో ఉన్నారు. వారు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలి. గతంలో సీ-గ్రేడ్‌లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో వారిని మార్చి కొత్తవారికి టికెట్లు ఇచ్చాం. మీరు అనుభవజ్ఞులు, మీతో నాకు అనుబంధం ఉంది. కొత్తవారు వస్తే వారిని తయారు చేయడానికి సమయం పడుతుంది. మిమ్మల్ని వదులుకోవాలనుకోవడం లేదు. గ్రేడ్ పెంచుకోడానికి కృషి చేయాలి."
- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ తరఫున ఆరు సెట్ల నామినేషన్లు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ తొలిరోజు ఆదివారం ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, సబితారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష నేతలు నామా నాగేశ్వరరావులు ఎంపీల తరఫున నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల నేతలు విడివిడిగా మరో నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు.
కర్నె ప్రభాకర్‌కు అనుమతి నిరాకరణ
తెరాస శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుండగా.. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కనుక ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో పోలీసులు అనుమతించలేదు.