రాష్ట్రంలో పేదలకు ఇబ్బంది కలగకుండా సమ్మె విరమించాలని హమాలీలకు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పౌర సరఫరాల సంస్థలో పనిచేసే హమాలీల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని... తక్షణమే సమ్మెను విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు హమాలీ యూనియన్లకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విధులకు హాజరైన వెంటనే సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
హమాలీల న్యాయ పరమైన సమస్యల విషయంలో సానుకూలంగా ఉన్నామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొవిడ్-19 నేపథ్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలని సూచించారు. గోదాముల్లో బియ్యం లోడింగ్, అన్ లోడింగ్ సమస్యలు రాకుండా, రేషన్ షాపులకు బియ్యం రవాణా జరగాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే అన్ని హమాలీల యూనియన్లతో చర్చించి సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు చేపడతామని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.