ఈనెల 8 మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet)జరగనుంది. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో ఈనెల 9 తేదీ వరకు లాక్డౌన్ (LOCKDOWN)విధించారు. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించాలా... రాత్రి కర్ఫ్యూ పెట్టాలా అనే అంశంపై క్లారిటీ రానుంది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులు, వైద్యం, నీటిపారుదల, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. వంటి అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.
రెండో దశ కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కొవిడ్ థర్డ్ వేవ్‌ను (COVID THIRD WAVE)సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధతపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
కరోనా కట్టడికోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో.. దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితం అయిందనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీచూడండి: 'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'