ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా... ఇతర చట్టాల సవరణ ముసాయిదా బిల్లులకు ఆమోదమే ప్రధాన అజెండాగా భేటీ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్, పురపాలక చట్టాల తరహాలోప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి జవాబుదారీతనం... పారదర్శకతతో పనిచేసేలా చట్టంలో నిబంధనలు పొందుపర్చనున్నారు.
కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో ఆస్తుల విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాన్ని తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి కూడా సవరణ చేయనున్నారు. హైకోర్టు సూచించిన విధంగా సీఆర్పీసీ చట్టానికి కూడా సవరణలు చేయనున్నారు. ఈ చట్ట సవరణల బిల్లులపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. వాటిని.. ఈనెల 13న శాసనసభలో ప్రవేశపెడతారు.
హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు సహా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వానాకాలం పంటల కొనుగోళ్లు, యాసంగిలో నిర్ణీత విధానంలో సాగు అంశాలపై కూడా... కేబినెట్లో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ భేటీకి ముందే యాసంగిలో సాగు, కొనుగోళ్లపై మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్‌తో సీఎం సమీక్ష నిర్వహించారు.