ఇందిరాగాంధీ అధికారాన్ని కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ ప్రకటించారని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆరోపించారు. రాజ్యాంగ సవరణను ఇందిరాగాంధీ మొదలు పెట్టారన్న ఆయన.. రాజ్యాంగ పీఠికనూ మార్చారని విమర్శించారు. ప్రజల్లో అభద్రతా భావం తీసుకువచ్చి, ఓట్లు పొందేందుకు సెక్యులరిజం అనే పదాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి చిల్లర రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో 'భారత ప్రజాస్వామ్యంలో చీకటి కాలం' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి విద్యాసాగర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మహారాష్ట్ర గవర్నర్ పదవి కాలం పూర్తయ్యాక.. తాను ఇక్కడికి వస్తే భాజపా అధ్యక్షుడు అవుతాడని ప్రచారం సాగిందని.. 70 ఏళ్లు దాటిన వ్యక్తి అధ్యక్షుడు ఎలా అవుతాడని విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత భాజపాకే ఉందన్న ఆయన అదృష్టమో, దురదృష్టమో వేరే వాళ్లు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో భాజపా ముఖ్యమంత్రి పదవి చేపడుతుంటే ముందు వరుసలో కూర్చొని చూడాలన్నదే తన కోరిక అన్నారు.
శాంతి భూషణ్ అనే అడ్వొకేట్ లేకపోతే ఇందిరాగాంధీ చేసిన తప్పిదాలు ప్రజలకు తెలిసేవి కావని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసిందని మండిపడ్డారు. నేటి కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ప్రశ్నించిన పత్రికలను అణిచివేస్తూ, జర్నలిస్టులను అరెస్ట్ చేయిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎమర్జెన్సీ చరిత్రను చదివి ఉంటారని అందువల్లనే అలాంటి విధానాలనే అమలుచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఆనాటి పోరాట చరిత్రను పునికిపుచ్చుకొని ఉద్యమిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇవీచూడండి: