వర్షాకాల సమావేశాల ఎజెండా(telangana assembly session 2021) ఖరారు చేసేందుకు శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశమైంది. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఉపసభాపతి పద్మారావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మజ్లిస్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతలు అక్బరుద్దీన్ ఓవైసీ, మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు. వచ్చే నెల ఐదో తేదీ వరకు 8 పని దినాలు సమావేశాలు నిర్వహించాలని మొదట ప్రతిపాదించారు.
విపక్షాలకు ఎక్కువ సమయం..
గతంలో కరోనా కారణంగా తక్కువ రోజుల పాటు సమావేశాలు(telangana assembly session 2021) నిర్వహించినందున ఈసారి ఎక్కువ రోజుల పాటు నిర్వహించాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. కనీసం 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క కోరారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు శాసనసభ (telangana assembly session 2021) నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రభుత్వం చేసిన చాలా కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని రోజులైనా ఇబ్బంది లేదని... కనీసం 15 రోజులైనా నిర్వహిద్దామని సీఎం తెలిపారు. ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అర్థవంతమైన, ముఖ్యమైన అంశం అయితే సరిపడా సమయం కేటాయించాలన్న సీఎం... సభ్యుల సంఖ్య తక్కువే అయినప్పటికీ విపక్షాలకు ఎక్కువగానే సమయం ఇస్తున్నామని, ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందన్నారు.
దేశానికే ఆదర్శంగా..
కొత్త రాష్ట్రమైనప్పటికీ సమావేశాల నిర్వహణలో తెలంగాణ శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎ కేసీఆర్ తెలిపారు. కొత్తగా మరికొన్ని నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసనసభ కుస్తీ పోటీలకు వేదిక కారాదని... అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. సమావేశాల్లో చర్చించేందుకు అన్ని రాజకీయ పక్షాల నుంచి అంశాలు వచ్చాక వాటికి అనుగుణంగా పనిదినాలు, ఎజెండా నిర్ణయించాలన్న అభిప్రాయానికి బీఏసీ వచ్చింది.
చర్చించాల్సిన అంశాల జాబితా..
నిరుద్యోగం, దళితబంధు, జలవివాదాలు, విద్య, పోడుభూములు, వ్యవసాయం, వైద్యం, ధరణి పోర్టల్, నీటిపారుదల ప్రాజెక్టులు, నిత్యావసర ధరలు, శాంతిభద్రతలు, డ్రగ్స్ సంబంధిత అంశాలపై సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం లిఖితపూర్వకంగా కోరింది. మైనార్టీ సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధి పనులు, తదితర అంశాలపై చర్చించాలని మజ్లిస్ కోరింది. వ్యవసాయం, హరితహారం, ఐటీ-పరిశ్రమలు మూడు అంశాలను ఇచ్చిన తెరాస... మరో ఏడు అంశాలు ఇస్తామని తెలిపింది. అన్నింటిని పరిశీలించిన సభాపతి సోమవారం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ప్రోటోకాల్ పాటించాల్సిందే...
ఎమ్మెల్యేల కోసం హైదరాబాద్‌లో క్లబ్ నిర్మించాలన్న అంశం బీఏసీలో చర్చకు వచ్చింది. దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ తరహాలో క్లబ్ నిర్మాణం జరగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఇందుకోసం మంత్రులు, శాసనసభాపక్ష నేతలతో కలిసి దిల్లీ వెళ్లి రావాలని సభాపతి పోచారంను కోరారు. శాసనసభ్యుల ప్రోటోకాల్ అంశాన్ని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రస్తావించారు. చాలా సందర్భాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ప్రోటోకాల్ సమస్య ఎప్పట్నుంచో ఉందని.. సభ్యుల గౌరవానికి ఎక్కడా భంగం కలగరాదన్న సీఎం కేసీఆర్... అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. అటు శాసనసభ కార్యదర్శి హోదా పెంచాల్సిన అవసరం ఉందని... పార్లమెంట్ కార్యదర్శికి కేబినెట్ సెక్రటరీ హోదా ఉన్నట్లే ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. బిల్లులకు సంబంధించి సభ్యులకు ముందే సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ అన్నారు.
మిగతా రాష్ట్రాలలో పోలిస్తే... మనమే భేష్..
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ శాసనసభ సమావేశాలు బాగా జరుగుతున్నాయని... ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను సభ ద్వారా చెప్పుకోవాలని... సమావేశాలు ఎన్ని రోజులైనా ఇబ్బంది లేదని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిపారు. అన్ని పక్షాల నుంచి అంశాలు అందాక పనిదినాలు, ఎజెండాను సభాపతి ఖరారు చేస్తారని మంత్రి తెలిపారు. బీఏసీ సమావేశానికి ఎవరిని పిలవాలన్నది సభాపతి నిర్ణయిస్తారని... భాజపా సభ్యుల ఆరోపణలకు సమాధానంగా చెప్పారు. ఆర్డినెన్స్‌ల స్థానంలో రెండు బిల్లులు ఉన్నాయని, మరికొన్ని కూడా వస్తాయని అన్నారు.
ఇవీ చూడండి: