ఈఎస్ఐ కుంభకోణం రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో ఆరుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించిన అవినీతి నిరోధకశాఖ.. తాజాగా మరో నలుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. లైఫ్ కేర్ ఎండీ సుధాకర్ రెడ్డి, అర్సీపురం ఈఎస్ఐ సీనియర్ అసిస్టెంట్ సురేంద్ర బాబు, వెంకటేశ్వర హెల్త్ సెంటర్ డాక్టర్ చెరకు అర్వింద్ రెడ్డి, నాచారం ఈఎస్ఐ ఫార్మసిస్ట్ నాగలక్ష్మిని అనిశా విచారించనుంది.
16 మంది అరెస్టు
వీరిని రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలు, హెల్త్ క్యాంపుల ద్వారా నొక్కిన సొమ్ము వివరాలపై అధికారులు ఆరా తీయనున్నారు. ఈ కేసులో మరో ముగ్గురిని అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. వీరి అరెస్టుతో ఈ సంఖ్య 16కు చేరింది. చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్టు లావణ్య, తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ ఈఎస్ఐ కార్యాలయంలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగి పాషాను అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ సంచాలకులు దేవికారాణితో కలిసి ఔషధాల కొనుగోలులో వీళ్లు ముగ్గురు అక్రమాలకు పాల్పడినట్లు అనిశా అధికారులు గుర్తించారు.
అవసరం లేకున్నా కొనుగోలు...
అవసరం లేకున్నా ఔషధాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం, డిస్పెన్సరీలకు వెళ్లాల్సిన మందులను ప్రైవేట్ ఫార్మా కంపెనీలకు మళ్లించి బహిరంగ మార్కెట్‌లో విక్రయించినట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. వీటి విలువ రూ.28 కోట్ల వరకూ ఉంటుందని గుర్తించారు. దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాల ఆధారంగా అనిశా మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: కాలు విరిగిందని జీహెచ్ఎంసీపై వ్యక్తి కేసు