ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 600 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని(amaravathi movement) మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్ధతుగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కలను సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లాచెదురు చేశారని అచ్చెన్న దుయ్యబట్టారు. భవిష్యత్తును అంధకారం చేస్తున్న జగన్పై ప్రజలు తిరగబడాలని కోరారు. నిండు అసెంబ్లీలో రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని జగన్ చెప్పారన్న అచ్చెన్న.. రాజధానికి కనీసం 30వేల ఎకరాలు తగ్గకుండా ఉండాలని అన్నారని గుర్తు చేశారు. చర్చి, మసీదు, గుళ్ల నుంచి మట్టిని తెచ్చి అమరావతికి శంకుస్థాపన చేస్తే, వాటిని అవమానించేలా జగన్ వ్యవహరం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి ప్రతిఫలం దక్కి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగడం ఖాయమని తేల్చి చెప్పారు.
రైతులదే అంతిమ విజయం..
అమరావతిని అంతం చేసేందుకు వైకాపా నాయకులు గల్లీ నుంచి దిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటినీ రైతులు ఓర్పుతో ఛేదించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బెదిరింపులు, అణచివేత, అరెస్టులకు అదరం బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు తెలిపారు. రోడ్లను సైతం తవ్వేస్తూ అమరావతిని చంపేశాం అని జగన్ రెడ్డి ఆనందపడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. వైకాపా తవ్వుకున్న ఆ గుంతల్లోనే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారని ఎద్దేవా చేశారు. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులనే అంతిమ విజయం వరించబోతుందని అభిప్రాయపడ్డారు.
నాడు అమరావతిని జగన్ స్వాగతించలేదా...
'ప్రతిపక్ష నేతగా అమరావతిని జగన్ స్వాగతించలేదా... ఆనాడు స్వాగతించిన జగన్ నేడు అడ్డుకుంటున్నారు. మోసం అనే పదం జగన్‌ను చూసే పుట్టిందేమో అనిపిస్తోంది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలు, రైతులను అరెస్టు చేస్తారా.? మీడియాను అడ్డుకోవటం పత్రికా స్వేచ్ఛను హరించటమే. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎందరో రైతులు భూములు త్యాగం చేశారు. రైతులు, రాష్ట్ర భవిష్యత్తును జగన్ అంధకారం చేశారు. జగన్ 3 రాజధానులు కడతానని చెప్పి 600 రోజులైంది. ఇప్పటివరకు ఎక్కడైనా 6 ఇటుకలు కూడా పేర్చలేదు.'- యనమల రామకృష్ణుడు, తెదేపా నేత
మాజీ మంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్...
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను పోలీసులు గొల్లపూడిలో హౌస్ అరెస్ట్ చేశారు. రాజధాని రైతులపై పోలీసుల నిరంకుశ వైఖరిని ఖండిస్తూ గొల్లపుడి హైవేపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో దేవినేని, కొనకళ్లను గృహనిర్భంధం చేశారు. గేట్లకు తాళం వేశారు. అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుకుందని, న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా ప్రతి ఒక్కరు అమరావతి కోసం మొక్కుతున్నారని ఉమా అన్నారు.
33 వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన విషయాన్ని ఉమా గుర్తు చేశారు. గతంలో జగన్ తాను ఇక్కడ పెద్ద ఇల్లు కట్టుకున్నానని, చంద్రబాబుకి ఇల్లే లేదని శాసన సభలో, బయట చెప్పి నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఇవాళ రైతాంగాన్ని గొంతు కోశారని ధ్వజమెత్తారు. అమరావతిలో పోలీసులు లాఠీలతో రైతు వెంట పడుతున్నారని, దళిత జేఏసీ నాయకురాలు శిరీష అనే తల్లిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు కూడా ర్యాలీలో పాల్గొనటానికి వీలు లేకుండా ఎక్కడికిక్కడ హౌస్ అరెస్ట్ లు చేశారని మండిపడ్డారు. రైతులు, మహిళల మీద దాడులు చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అమరావతి అనే స్లోగన్ కూడా వినలేకపోతున్నారని, తమ బాధ, ఆవేదన తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి.. అదే ఆ కుర్రాడి ఆదాయమండి!