achennaidu: ఏపీకీ ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి నటించిన జగన్ రెడ్డికి 'మోసకార్ అవార్డు' ఇవ్వాల్సిందేనని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో హోదా అంటూ డ్రామాలాడి.. ఇప్పడు నోరు మెదటపటం లేదని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన కేసుల మాఫీ కోసం ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను అమ్మేశారని అచ్చెన్న దుయ్యబట్టారు.
ప్రత్యేకహోదాకు సంబంధించి.. వైకాపా లోపాయికారితనం, చేతకానితనం మరోసారి రాష్ట్ర ప్రజలకు బహిర్గతమైందని తేల్చిచెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి నియమించిన సబ్ కమిటీ ఎజెండాలో ప్రత్యేక హోదా చేర్చి మళ్లీ తొలగించటం వైకాపా లోపారికారితనం, చేతకానితనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి నుంచి దిల్లీ వరకు ప్రత్యేక హోదా ఎక్కడా వినిపించకుండా హోదా అనే పదాన్ని బ్యాన్ చేశారన్న అచెన్న.. హోదా అంటూ యువ భేరీల పేరుతో యువతను మోసం చేసిన జగన్ యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనపుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వైకాపా ఎంపీలకు లేదని వెంటనే రాజీనామా చేయాలన్నారు.
ప్రత్యేక హోదాను వదిలేశారు - పయ్యావుల కేశవ్
ఇంత మంది ఎంపీలను గెలిపిస్తే.. ప్రత్యేక హోదా మీద నోరువిప్పి మాట్లాడలేరా..? అని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. సీఎం జగన్ను ప్రశ్నించారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన అభ్యర్థనలో ఎక్కడ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని విమర్శించారు. తిట్టడానికి ఇద్దరు మంత్రులను, అప్పులు తీసుకరావటానికి ఓ మంత్రిని నియమించిన జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదా అంశంపై ఒక మంత్రిని నియమించ లేరా అని నిలదీశారు. కేవలం తమకు అవసరమైన అంశాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు చేస్తూ ప్రత్యేక హోదా వదిలేశారని ఆరోపించారు.
ఇదీ చదవండి: