Vengala Rao released: ఆంధ్రప్రదేశ్ జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం యూట్యూబర్, తెదేపా కార్యకర్త బొబ్బూరి వెంగళరావును సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. వాదనల అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వెంగళరావును విడుదల చేసింది. పోలీసుల విజ్ఞప్తిని సీఐడీ కోర్టు తిరస్కరించింది. పోలీసులు 41-ఎ నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై వెంగళరావును పోలీసులు అరెస్టు చేశారు.
నిన్న కేసు విచారణ సందర్భంగా అతనిని సీఐడీ పోలీసులు హింసించారని మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం ఇవాళ సీఐడీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
"వైకాపా ప్రభుత్వం అవినీతిని నిత్యం ప్రశ్నిస్తున్నా. అర్ధరాత్రి అరెస్టు చేసి శారీరకంగా, మానసికంగా వేధించారు. సీఐడీ పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉంది. చంద్రబాబు, లోకేశ్ పేరు చెబితే వదిలేస్తామని చెప్పారు. నాపై కేసులకు, తెదేపా నేతలకు ఏమిటి సంబంధం?. రాజధాని, పోలవరం గురించి ప్రశ్నిస్తే వేధింపులా?. వేలకోట్ల ప్రజాసంపద దోచుకుంటుంటే ప్రశ్నించడం తప్పా?. అణచివేత అనేది తిరుగుబాటుకు కారణమవుతుందని గ్రహించాలి." -వెంగళరావు, తెదేపా సోషల్ మీడియా కార్యకర్త
ఇదీ జరిగింది: ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసిన తెలుగుదేశం కార్యకర్త వెంగళరావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. "ఘర్షణ" పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న వెంగళరావు.. కుప్పం ఘటనపై ప్రజలు తిరగబడాలని పిలుపునిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలపైనే వెంగళరావుని సీఐడీ అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. వెంగళరావుని విడుదల చేయాలంటూ గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వెంగళరావు తరపున్యాయవాదులను పోలీసులు సీఐడీ కార్యాలయంలోకి అనుమతించారు. సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చిన వెంగళరావు తల్లిదండ్రులు... తమ కుమారుడిని ఏం చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంగళరావును సీఐడీ అధికారులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. కోర్టు సమయం ముగియడంతో జడ్జి ఇంటికే వెంగళరావును తీసుకెళ్లారు. జడ్జి ఎదుట వెంగళరావు సీఐడీ పోలీసులు తనను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను బట్టలిప్పి కొట్టారని.. కొట్టినట్లు చెప్పితే బెయిల్ రాదని బెదిరించారని వాపోయాడు. ఒకవేళ చెప్తే కేసుల్లో ఎలా ఇరికించాలో తమకు తెలుసని... తనను కొట్టి పేపర్‌పై సంతకం తీసుకున్నారని తెలిపాడు. వెంగళరావును ఎలా కొట్టారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. బల్లపై పడుకోబెట్టి నడుంపై కూర్చుని కాళ్లు పైకెత్తి కొట్టారని వివరించాడు.
ఇవీ చదవండి: Youtuber Arrest in AP బట్టలిప్పి మరీ కొట్టారంటూ యూట్యూబర్ ఆవేదన