అనంతపురంలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ర్యాలీ ముగిసింది. అమరావతి కోసం.. తెదేపా అధినేత చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. జీఎన్‌రావు, బీసీజీ కమిటీవి చెత్త నివేదికలని విమర్శించారు. జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను భోగిమంటల్లో వేయాలన్నారు.
కొండవీటి సింహాల్లా గర్జించండి
అన్యాయం జరిగినప్పుడు కొండవీటి సింహాల్లా గర్జించిన జిల్లా అనంతపురం అని చంద్రబాబు అన్నారు. ప్రజలందరూ గళం విప్పితే... ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందన్నారు. ఒక రాష్ట్రం, ఒకే రాజధాని నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ఒక వ్యక్తి కంకణం కట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. అమరావతి పరిరక్షణకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. అమరావతి కోసం ప్రజలంతా ఉద్యమించాలన్నారు.
తిరిగి అధికారంలోకి వస్తాం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న ప్రాంతం.. అమరావతి అని చంద్రబాబు అన్నారు. కృష్ణా, గోదావరి నదులు కలిపిన ప్రాంతంలో అమరావతి ఉందన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. అమరావతిలోనే అన్నీ ఉన్నాయి.. ఇక డబ్బులు దేనికని ప్రశ్నించారు. ప్రపంచం మెచ్చే రాజధాని కట్టాలనుకుంటే.. చెడగొడుతున్నారని విమర్శించారు. పాలన చేతకాకుంటే ఇంట్లో ఉండాలన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చి అమరావతిని నిర్మిస్తామన్నారు.
వైకాపా పాలనతో పరిశ్రమలు వెనక్కి
అనంతపురం జిల్లాలో దాదాపు రూ.6 లక్షల విరాళం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనన్నారు. వైకాపా పాలనలో కియా అనుబంధ పరిశ్రమలు వెనక్కి వెళ్లాయన్న చంద్రబాబు.. 5 వేల ఉద్యోగాలు రాకుండా పోయాయన్నారు. కర్నూలు జిల్లాకు ఎన్నో సంస్థలు తీసుకొచ్చామన్నారు. రాయలసీమకు మరెన్నో పరిశ్రమలు రావాలన్నారు. 4 ఆఫీసులు పెడితే అభివృద్ధి అవుతుందని మోసం చేస్తున్నారని వైకాపాను విమర్శించారు.
17 నుంచి ఉద్యమం ఉద్ధృతం
అమరావతికి 130 సంస్థలు వచ్చాయన్న చంద్రబాబు.. 50 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖలో భూములు కొట్టేయాలని వైకాపా నేతలు పథకం వేస్తున్నారని ఆరోపించారు. కార్యాలయాలు తరలిస్తే ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. సచివాలయం మారిస్తే విశాఖకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలన్నారు. మహిళలు, పిల్లలను బాధపెట్టవద్దని పోలీసులకు చంద్రబాబు హితవు పలికారు. అనుకున్న ఆశయాన్ని ప్రాణాలు పోయినా వదిలిపెట్టనని తేల్చిచెప్పారు. ఈ నెల 17 నుంచి అమరావతి ఐకాస కార్యక్రమాలు ఉద్ధృతమవుతాయన్నారు.
ఒక్క పెట్టుబడి వచ్చిందా..?
వైకాపా పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదన్న చంద్రబాబు... ఒక్క పెట్టుబడిదారుడు కూడా ఏపీ వైపు చూడలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని చూసి బయటివాళ్లు నవ్వుతున్నారన్నారు. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లు ఎవరో యువత, విద్యార్థులు ఆలోచించాలన్నారు.
ఇదీ చదవండి : ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం