Ashok Babu allegations against Botsa: ఏపీ పరువు తీసే నిర్ణయం మంత్రి బొత్స ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఓ సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స పార్టీ, ప్రభుత్వ పరువు ఎందుకు తీయాలనుకున్నారో ఆయనకే తెలియాలన్నారు. బొత్స చెప్పినట్లు హరీశ్ రావు ఏపీకి వచ్చి నలుగురు ఉపాధ్యాయులతో మాట్లాడితే ఏపీ పరువు పోవటం ఖాయమని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులకు సమ్మతమైన ఏ ఒక్క అంశమూ బొత్స మాట్లాడలేదని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి వచ్చి పరిశీలించడానికి ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు ఏం చేసిందని నిలదీశారు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టిన పరిస్థితులు హరీశ్‌రావుకు వివరిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏపీలో ఉపాధ్యాయులతో బోధనేతర కార్యక్రమాలే ఎక్కువ చేయిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో తమ పరిస్థితి బాలేదని ఉపాధ్యాయ సంఘాలే ముక్తకంఠంతో చెప్తుంటే హరీశ్ రావుకు బొత్స కొత్తగా ఏం చూపిస్తారన్నారు. ఏపీలో ఉపాధ్యాయులను ఉదాహరణగా చూపి, తెలంగాణ టీచర్లని హరీశ్ రావు భయపెట్టడం ఏపీ దుస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. కమిటీలతో కాలయాపన తప్ప ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేసింది శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని దుస్థితి ఏపీలో ఉపాధ్యాయులకు ఉందని వెల్లడించారు.
ఇవీ చదవండి: