Kondapally municipality Chairman Election: ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక క్షణానికో మలుపు తిరుగుతోంది. నిన్న గందరగోళ పరిస్థితుల్లో నేటికి వాయిదా పడ్డ ఎన్నిక.. నేడు జరగలేదు.
ఇవాళ ఉదయం ఎక్స్‌అఫిషియో సభ్యులతో సహా వైకాపా, తెలుగుదేశం కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వద్ద కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బల్లలు చరుస్తూ న్యాయం కావాలంటూ వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. కార్యాలయం బయటకు వచ్చి ఆందోళన కొనసాగించారు. ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్యాలయం వద్ద బారికేడ్లను తోసుకుంటూ ముందుకొస్తున్న వైకాపా కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. కార్యాలయం బయట వైకాపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎన్నిక ప్రక్రియ అడ్డుకునేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని తెలుగుదేశం ఆరోపించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రెండో రోజూ వాయిదా పడింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్వో ప్రకటించారు.
ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలంటూ తెలుగుదేశం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అందులో భాగంగా అధికారులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్, విజయవాడ పోలీసు కమిషనర్ కోర్టుకు రావాలని ఆదేశించింది. అధికారులు కోర్టుకు హాజరై ఎన్నిక వాయిదా పడిన తీరును వివరించారు. అనంతరం కోర్టు బుధవారం కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది.
400 మంది పోలీసులతో మూడంచెల భద్రత
సోమవారం జరిగిన గొడవ రీత్యా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది పోలీసులతో పురపాలక సంఘ కార్యాలయాన్ని అదుపులోకి తీసుకున్నారు. పురపాలక సంఘ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరో 100 మీటర్ల దూరంలో ఇనుప కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పురపాలక సంఘ కార్యాలయానికి వచ్చే అన్ని దారులను పోలీసులు నిర్బంధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదీచూడండి: kondapalli municipality : కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు ఆగ్రహం