ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వ్యవహారంలో హైకోర్టు తీర్పును అమలుచేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. గవర్నర్ నిర్ణయాన్ని తెదేపా స్వాగతించింది. భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని గవర్నర్ నిలబెట్టరాని తెదేపా అధినేత చంద్రబాబు సంతోషం వ్యక్తంచేశారు. ఈ చర్యలతో ఆర్టికల్ 243కె(2)కు సార్థకత ఏర్పడిందన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింస విధ్వంసాలు, అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రానికి అప్రతిష్ట వాటిల్లిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య నాలుగు మూల స్థంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖతో పాటు మీడియా మనుగడ ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు.
వైకాపా ప్రభుత్వానికి గట్టి దెబ్బ : యనమల
కరోనా సమయంలో ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీని తొలగించి రాజ్యాంగ ఉల్లంఘనకు వైకాపా ప్రభుత్వం పాల్పడిందని చంద్రబాబు అన్నారు. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడిందన్నారు. గవర్నర్ ఆదేశాలు జగన్ ప్రభుత్వానికి, అతని న్యాయ విభాగానికి గట్టి దెబ్బ అని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఇకనైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని యనమల హితవుపలికారు.
రాజ్యాంగ విలువలు పరిరక్షించారు : సోమిరెడ్డి
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎస్ఈసీగా నియమించి హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించడం ప్రజాస్వామ్య విజయమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ పాత్రను ఎవరైనా శిరసావహించక తప్పదని తన ఉత్తర్వుల ద్వారా సందేశం ఇచ్చిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని, విలువలను కాపాడటంలో పొరపాట్లు చేయకుండా ప్రవర్తిస్తుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.
గవర్నర్ నిర్ణయం హర్షణీయం : చినరాజప్ప
కరోనా ప్రభావం గమనించి రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప గుర్తుచేశారు. అందుకే జగన్ ప్రభుత్వం ఆయన్ని తప్పించి కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని విమర్శించారు. న్యాయస్థానం ఆయనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని ఇచ్చిన తీర్పుతో గవర్నర్ ఆదేశాలు జారీచేయటం హర్షణీయమన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని గవర్నర్ చెప్పడం శుభపరిణామని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తమ నిర్ణయాలను, చర్యలను కోర్టులు తప్పపడుతున్నా ప్రభుత్వానికి జ్ఞానోదయం కావడం లేదని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ పనితీరుపై హైకోర్టు స్పందన చూశాకైనా ప్రభుత్వంలో మార్పులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజాస్వామ్య విజయం : అమర్నాథ్ రెడ్డి
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని నియమించమని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరడం ప్రజాస్వామ్య విజయమని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి హర్షంవ్యక్తం చేశారు. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచిందన్నారు. అధికారం ఉంది కదా అని రాజ్యాoగాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదనేది ఇకనైనా జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. మిగిలిన అసంబద్ధ నిర్ణయాలకు కూడా చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి : 'ఎస్ఈసీ వ్యవహారంలో గవర్నర్ నిర్ణయం మంచి ముగింపు'