రైతుల త్యాగాలను వైకాపా ప్రభుత్వం అపహాస్యం చేసింది. అందరి సమక్షంలో తీసుకున్న అమరావతి రాజధాని నిర్ణయాన్ని మూర్ఖత్వంతో ఏకపక్షంగా ప్రభుత్వం మార్చేసింది. ఇది విభజన చట్టానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం - దేవినేని ఉమ, మాజీ మంత్రి
ప్రజలు కోరుకున్న రాజధాని అమరావతి. మూర్ఖులు పాలకులైతే ప్రజాస్వామ్యానికే ముప్పని తేటతెల్లమైంది.- తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు
రాజధాని పేరుతో దోచుకునేందుకు కుట్ర పన్నటం సిగ్గుచేటు. జగన్ చారిత్రక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని 5 కోట్ల ప్రజలు భావిస్తున్నారు - పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు
రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని నిరసిస్తూ కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలి - తెదేపా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులు బిల్లు గవర్నర్ ఆమోదించడం చారిత్రాత్మక తప్పిదం - పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడానికి స్వార్థ పూరిత చర్య. కరోనా రాజ్యమేలుతున్న పరిస్థితులలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోడం సరికాదు - తెదేపా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు
5కోట్ల ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా మూడు రాజధానుల బిల్లుకు... ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ప్రజా రాజధాని అమరావతి పట్ల మరణశాసన ముద్రను వేసినట్లయ్యిందని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చారిత్రక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని 5 కోట్ల ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలనతో ఎనలేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం