ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కచ్చితంగా 160 స్థానాల్లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో తెలుగురైతు విభాగం కార్యశాలలో అచ్చెన్న పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతును కలిసి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో వివరించాలన్నారు.
రైతులను సీఎం జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచిందన్నారు. ఉద్యోగుల నుంచి పేదల వరకు ప్రతీ రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసును తెదేపాకు అంటగట్టాలని చూశారని మండిపడ్డారు. వివేకా హత్య ద్వారా వచ్చిన సానుభూతితోనే జగన్ సీఎం అయ్యారు.. వివేక కేసులో నిందితులను ఎందుకు శిక్షించట్లేదని నిలదీశారు.
"ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నాయనుకోవద్దు. సీఎం జగన్ మెదట్లో ఏం ఆలోచన వస్తుందో తెలియదు. ఏదో ఓ రోజు లేచి శాసనసభ రద్దు చేస్తున్నా అని లెటర్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. అందరూ సిద్ధంగా ఉండాలి. నేను చెప్తున్నా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా తెదేపా 160 స్థానాల్లో విజయం సాధిస్తుంది. ఇదేదో మైకు దొరికిందని.. మీరు వింటున్నారని చెప్పట్లేదు. నేను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఏ ప్రభుత్వంపైనైనా ఒక ప్రాంతంలో వ్యతిరేకత ఉంటుంది. ఏ వ్యక్తిపైనైనా ఓ వర్గంలో వ్యతిరేకత ఉంటుంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని కదిలించినా.. జగన్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత వ్యతిరేకత నేనేప్పుడు చూల్లేదు. కాబట్టి.. అందరూ అప్రమత్తంగా ఉండి.. ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లండి"
- అచ్చెన్నాయుడు, తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు
ఇదీ చదవండి: