పేదల అభవృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ సినీ రంగంలో రారాజుగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సేవల కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పరిపాలనలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. తెదేపా హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని... జీనోమ్ వ్యాలీ వల్ల భారత్ బయోటెక్ సహా ఎన్నో కంపెనీలు వచ్చాయని వెల్లడించారు. ఇప్పుడు భారత్ బయోటెక్ కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసిందని చెప్పారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేశారు చంద్రబాబు. దేశ అత్యున్నత పురష్కారం వచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వరకు సాధిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన బాలకృష్ణ