ఏపీలోని నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలను(nellore municipal corporation elections news) తక్షణమే నిలుపుదల చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు(chandrababu on nellore municipal corporation elections news). అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో గడువు ముగిసినా ఇంతవరకూ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించలేదని తెలిపారు. దీనిపై రిటర్నింగ్ అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తుది జాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు అయినట్లు ప్రకటించటమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు చర్యలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరూ శిక్షార్హులేనని స్పష్టం చేశారు. తక్షణమే నెల్లూరు నగరపాలక ఎన్నికల్ని నిలుపుదల చేయాలన్నారు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దని హితవు పలికారు. తప్పుడు పనులు చేస్తే భవిష్యత్తులో డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉండే అర్హత ముఖ్యమంత్రి కోల్పోతున్నారని దుయ్యబట్టారు.
'నెల్లూరులో గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించలేదు. నెల్లూరు ఘటనపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. అభ్యర్థుల జాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు ఎలా ప్రకటిస్తారు? తక్షణమే నెల్లూరు నగరపాలిక ఎన్నికలు ఆపాలి. దినేశ్‌కుమార్ అనే అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరులో 8 డివిజన్లు ఏకగ్రీవమని ఏకపక్షంగా ప్రకటించారు. ఎన్నికలు పారదర్శకంగా జరపాలని ఈసీని కోరుతున్నాం' - చంద్రబాబు, తెదేపా అధినేత
ఈసీకి చంద్రబాబు లేఖ
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు(chandrababu letter to EC on nellore municipal corporation elections). అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో కావాలనే జాప్యం చేశారని తెలిపారు. డాక్యుమెంట్లు తారుమారు చేసేందుకే జాబితా ప్రకటించడం లేదా? అని లేఖలో ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలు విత్‌డ్రా చేసుకున్నట్టు పత్రాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్‌ఈసీతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు
ఎస్‌ఈసీ నీలం సాహ్నీతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. నెల్లూరు, కుప్పం, దర్శిలో అక్రమాలు జరిగాయని వివరించారు. ప్రజాస్వామ్యం కాపాడేందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు తిరస్కరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ఆపి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెదేపా నేతల బైఠాయింపు..
కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెదేపా నాయకులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధుల నామినేషన్లు బలవంతంగా ఉపసంహరించేలా చేస్తున్నారని విమర్శించారు. వైకాపాకు కొమ్ముకాస్తున్న అధికారులను ఉరి తీసిన తప్పు లేదని విమర్శించారు. రాత్రి అయినా బరిలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించ లేదని... వెంటనే కలెక్టర్, కమిషనర్ స్పందించి జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: KTR Comments: 'అభివృద్ధిలో దూసుకుపోతున్నా కేంద్రం నుంచి చేయూత కరవు'