ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని... తెలంగాణ రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ- టాస్క్ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పేద, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ఉద్దేశించిన ఈ సెంటర్‌ను ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. పేద, గిరిజన ప్రజల.. అభ్యున్నతికి చేయూతనందిస్తే.. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కెరీర్ గైడెన్స్ పొందాలనుకునే యువత కోసం.. ప్రత్యేక హాట్ లైన్ నంబరు ఆవిష్కరిస్తున్నట్లు టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా ప్రకటించారు. కెరీర్ సంబంధ విషయాలపై నిపుణుల సలహాలు కోరే యువత 040-48488241 నంబరుకు కాల్ చేసి.. మార్గదర్శకత్వం పొందవచ్చని తెలిపారు. ఈ హాట్ లైన్ సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. హాట్ లైన్ సంప్రదింపులతో పాటు.. ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ తో మెంటర్ షిప్, పారిశ్రామిక ఆధారిత శిక్షణ కార్యక్రమాలను టాస్క్ నిర్వహిస్తుంది. అవకాశాలను యువత అందిపుచ్చుకునేలా చేసి.. వారి స్వయం ప్రతిపత్తికి టాస్క్ బాటలు వేస్తుందన్నారు.