హైదరాబాద్‌లో ఎన్ని ఉద్యానవనాలు ఉన్నా.. ట్యాంక్‌బండ్‌పై సేద తీరితే ఆ ఉత్సాహమే వేరు. అందుకోసమే మహా నగరవాసులకు మరింత ఆనందాన్ని పంచేలా ప్రభుత్వం... ఆకర్షణీయమైన విద్యుత్‌దీపాలు, పచ్చదనం, పుట్‌పాత్‌లతో సుందరీకరణ పనులు చేపట్టింది. ఐతే ఎంతో అందంగా తీర్చిదిద్దినప్పటికీ... ట్రాఫిక్ చిక్కులతో నగరవాసులు సేదతీరే అవకాశం లేకుండా పోయింది. దీంతో ట్యాంక్‌బండ్ అందాలు వీక్షించేలా ఆదివారం సాయంత్రం ట్రాఫిక్‌ను నిలిపివేయాలని ఓ సామాన్యుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ అవసరమైన చర్యలు చేపట్టాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజినీకుమార్‌కు సూచించారు. ఇందుకు అనుగుణంగా ఈ ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ నిలిపివేశారు. సందర్శకులకు మాత్రమే అనుమతి కల్పించారు.
సంతోషం వ్యక్తం చేస్తున్న సందర్శకులు
ప్రభుత్వం, పోలీసులు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన చర్యలు సత్ఫలితాల్ని ఇచ్చాయి. మహానగర వాసులు కుటుంబాలతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకరంగా గడిపారు. క్షణం తీరిక లేకుండా వాహనాలు పరుగులు తీసే రహదారి చిన్నారులకు ఆట స్థలంగా మారింది. ఈ వాతావరణంలో ఓ గిటారిస్ట్ సందడి చేశాడు. ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ఆటవిడుపు చాలా బాగుందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదండి: హైదరాబాద్ ఓఆర్‌ఆర్ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత