Bandi Sanjay PadaYatra: జనగామ జిల్లాలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్ పడింది. పాదయాత్ర కారణంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకోవటంతో పాటు వారికి భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో సంగ్రామ యాత్రకు సంజయ్ శ్రీకారం చుట్టారు. గతేడాది నుంచి రెండు విడతలు పాదయాత్ర పూర్తి చేసిన సంజయ్.... ఈ నెల 2న యాదాద్రి ఆలయం నుంచి మూడో విడత ప్రారంభించారు. అనంతరం 15వ తేదీన జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. రోజు 15 నుంచి 16 కిలోమీటర్లు నడక సాగిస్తున్నారు. తొలిరోజే దేవరుప్పులలో తెరాస, భాజపా మధ్య ఘర్షణ తలెత్తి...కర్రలు రాళ్లతో కొట్టుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్నుంచీ పోలీసులు బందోబస్తు మధ్య యాత్ర కొనసాగుతోంది.
పాలకుర్తిలోనూ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ముందస్తుగా దుకాణాలు మూసివేయించారు. స్టేషన్ ఘన్ పూర్ మండలంలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటిముందు ధర్నా చేసిన భాజపా కార్యకర్తలపై కేసులు నమోద నిరసిస్తూ సంజయ్ ధర్మదీక్షకు పిలుపునిచ్చారు. నల్ల బ్యాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. తమ నేతపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ గులాబీ శ్రేణులు ఉప్పగల్, కునూరు వద్ద భారీగా మెహరించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో...పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్ చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడినప్పటికీ... సంజయ్ దీక్షను భగ్నం చేశారు. కరీంనగర్‌కు తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు.
- ప్రజాసంగ్రామ యాత్ర ఇటీవల వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆగస్టు 27న ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారి దర్శనంతో యాత్ర పూర్తికావాల్సి ఉంది. అనంతరం హనుమకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని భాజపా నేతలు తెలిపారు. జేపీ నడ్డా సభకు వస్తారని వెల్లడించారు. సభ కోసం భారీ జనసమీకరణ చేసి సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇంతలో పాదయాత్రకు బ్రేక్ పడటంతో సభ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. పాదయాత్ర, బహిరంగ సభ నిర్వహణపైనా రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి.. ఎలాంటి షరతులు లేకుండా రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు - మునుగోడులో మెునగాడిని దించేందుకు కాంగ్రెస్ కసరత్తు షురూ