ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన నాగిరెడ్డిని... తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. ఏప్రిల్‌తో ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. కొత్త ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ప్రధాన కార్యదర్శి లేదా ఆపై హోదాలో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బాధ్యతలు ఎవరికి కట్టబెడతారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవీకాలం వచ్చే ఫిబ్రవరితో పూర్తి కానుంది. కొత్త పాలకమండలి కోసం జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల ముందస్తు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రారంభించేలోగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో అంతుచిక్కడం లేదు. పరిస్థితులు సద్దుమణిగితే గానీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం కోసం... పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి దస్త్రాన్ని పంపింది. కొత్త కమిషనర్ నియామకంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇదీ చూడండి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ