Anthrax in Andhra: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల గ్రామం దొరగుడలో ఆంత్రాక్స్ వ్యాధి తరహా లక్షణాలు బయటపడటం.. కలకలం రేపుతోంది. లక్ష్మీపురం పంచాయతీలోని అత్యంత మారుమూల గ్రామమైన దొరగుడలో.. గతంలోనూ ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాతపడ్డారు.
తాజాగా.. గ్రామంలో ఓ చిన్నారికి ఏర్పడిన గాయాలను చూసి ఆశా కార్యకర్త ఫోటో తీసి వైద్యులకు పంపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్.. గురువారం దొరగుడలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. వైద్యాధికారుల బృందం గ్రామంలో పర్యటించి.. వైద్యపరీక్షలు నిర్వహించారు. 15 మందికి లక్షణాలు ఉండగా.. వారిలో ఏడుగురికి తీవ్ర లక్షణాలు ఉండటంతో.. వారి రక్తనమూనాలను సేకరించారు. విశాఖ కేజీహెచ్‌లోని ప్రయోగశాలకు రక్త నమూనాలు పంపుతామని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నిర్ధరణకు వస్తామని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. గ్రామంలోని పశువులకు టీకాలు వేశారు.