నాలుగురోజుల పాటు నరాలు తెగేలా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరపడింది. నువ్వానేనా? అన్నట్లుగా సాగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానాన్ని అధికార పార్టీ కైవసం చేసుకుంది. రెండు ప్రాధాన్యత ఓట్లతో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్ధి రామచంద్రరావుపై 20,820 ఓట్లతో ఆమె గెలుపొందారు.
లెక్కింపు సాగిందిలా..
హైదరాబాద్ - రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ కుమార్తె, తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి విజయదుందుభి మోగించారు. సమీప ప్రత్యర్థి రామచంద్రరావు కంటే 20, 820 ఓట్లకు పైగా మెజార్టీ సాధించి గెలుపొందారు. బుధవారం ఓట్లలెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వాణిదేవియే ఆధిక్యంలో కొనసాగింది. తొలి ప్రాధాన్యత ఓటులో ఎలాంటి ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత లెక్కింపు అనివార్యమైంది. వాణీదేవికి తొలి ప్రాధాన్యతలో 1,12,689ఓట్లు ,రెండో ప్రాధాన్యతలో 36,580 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 1,49,269 ఓట్లు వచ్చాయి. తుది అభ్యర్థి రామచందర్ రావును ఎలిమినేట్ చేసే సమయానికి 1,89,339 ఓట్లు తెరాస సాధించింది. భాజపా అభ్యర్థి రామచంద్రరావు లభించిన 1,04,668 ఓట్లలో తెరాస అభ్యర్థి వాణీదేవికి రెండో ప్రాధాన్య ఓట్లు 40,070 దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 1,68,520 ఓట్ల కంటే.. 20,820 ఓట్లు అధికంగా సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సమీప ప్రత్యర్థి రామచంద్రరావు మొదటి ప్రాధాన్యతలో 1,04,668 ఓట్లు, రెండో ప్రాధాన్యతలో 32,898 ఓట్లు వచ్చాయి. మొత్తంగా రామచంద్రరావుకు 1,37,566 ఓట్లు పోలయ్యాయి. మూడోస్థానంలో నిలిచిన.... ఫ్రొఫెసర్ నాగేశ్వరరావు నుంచి రెండో ప్రాధాన్యత లెక్కింపులో తెరాసకు 21,259 ఓట్లు... భాజపాకు 18,368 ఓట్లు బదిలీ అయ్యాయి.
మంత్రుల కృతజ్ఞతలు..
హైదరాబాద్-రంగారెడ్డి-పాలమూరు స్థానాన్ని తెరాస కైవసం చేసుకోవడం పట్ల మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. గెలుపొందిన వాణీదేని అభినందించిన మంత్రి హరీశ్‌రావు. ప్రజలు కేసీఆర్ పక్షాన ఉన్నారని మరోసారి నిరూపితమైందని వ్యాఖ్యానించారు. తెరాసను ఆశీర్వదించిన పట్టభద్రులకు మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. వాణీదేవి విజయానికి తోడ్పడేలా ఎన్జీవో, ఇతర ఉద్యోగసంఘాల నేతలు అండగా నిలబడ్డారంటూ కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి పట్టభద్రులు ఓటు వేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. విద్యావంతులు ఏ నమ్మకంతో ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నెరవేరుస్తామని తలసాని హామీ ఇచ్చారు. ఉత్కంఠ పోరులో విజయం సాధించిన సురభి వాణీదేవికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను సన్మానించి మిఠాయిలు తినిపించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
కార్యకర్తల సంబురాలు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సందర్భంగా తెలంగాణ భవన్‌లో గులాబీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని మండలి ఎన్నికల గెలుపును ఆస్వాదించారు. డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. బాణసంచా కాల్చుతుండగా... నిప్పురవ్వలు ఎండిన చెట్లపై పడి స్వల్ప మంటలు చెలరేగగా... అగ్నిమాక సిబ్బంది ఆర్పేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో తెరాస శ్రేణులు బాణసంచా కాల్చుతూ బైక్ ర్యాలీ చేపట్టి సంబరాలు చేసుకున్నారు.