కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలే రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ)కి ఉంటాయని కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ అహ్మదాబాద్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఎస్‌ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థని తెలిపింది. సాధారణ పరిస్థితుల్లో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలను నిర్వహించాలని పేర్కొంది. అదనంగా సంభవించే ఇబ్బందులు (సూపర్‌వీనింగ్), ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఎన్నికల్ని వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి ఉందని ఆ తీర్పులో స్పష్టం చేసింది. దేవుడి చర్యలు (యాక్ట్ ఆఫ్ గాడ్) చట్ట నిబంధనలను అమలు చేయలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు వాయిదా వేయవచ్చని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వాలు సరైన దిశలో ఎన్నికలు నిర్వహించడం లేదని, ఒక వేళ నిర్వహించినా సక్రమంగా ఉం డటం లేదన్న కారణంతో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తీసుకొచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీలకు విస్తృత అధికారాలుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక తాము ఇచ్చిన ఈ తీర్పునకు ఆయా రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని తెలిపింది. ఒకవేళ తమ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి లేకపోతే ఎస్‌ఈసీలు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందవచ్చని పేర్కొంది. 2006లో సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైకే సభర్వాల్, అప్పటి న్యాయమూర్తులు జస్టిస్ కేజీ బాలకృష్ణన్, జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా, జస్టిస్ సీకే థక్కర్, జస్టిస్ పీకే బాలసుబ్రమణ్యన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
- ఇదీ చదవండి: 'కరోనా రావద్దంటే స్మార్ట్ఫోన్నూ కడగాల్సిందే'