షాద్నగర్ ఎన్కౌంటర్ను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... షాద్నగర్ ఘటనపై పూర్తి అవగాహనతో ఉన్నామని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఎన్కౌంటర్ కేసు తెలంగాణ హైకోర్టులో ఉన్న అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు చేసే యోచనలో ఉన్నామని.. ఇప్పటికే మాజీ జస్టిస్ పీవీ రెడ్డిని సంప్రదించగా.. దర్యాప్తు చేసేందుకు ఆయన నిరాకరించినట్లు తెలిపారు. దిల్లీలోని ఉండి విశ్రాంత న్యాయమూర్తి దర్యాప్తు చేసేలా చూస్తామంటూ సీజేఐ తెలిపారు.
ఈ విషయంలో కలుగజేసుకున్న తెలంగాణ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి... ప్రభుత్వ వాదనలు కూడా విన్నాకే విచారణలో ముందుకెళ్లాలని కోరారు. దీంతో మాజీ న్యాయమూర్తితో దర్యాప్తుపై సలహాలతో గురువారం కోర్టుకు రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తుల పేర్లను కూడా సూచించవచ్చని తెలిపింది. నేడు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు చేపట్టాలా.. లేదా వద్దా.. అన్న అంశంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
షాద్నగర్ ఎన్కౌంటర్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని.. ఉద్దేశపూర్వకంగానే నిందితులను కాల్పిచంపారంటూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిటిషన్ వేయగా.. ముకేష్ కుమార్ శర్మ లేఖ రాశారు. న్యాయస్థానం వీటిపై విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు అత్యంత కీలకమైనది కావడం వల్ల తెలంగాణ ప్రభుత్వం.... కేసు విచారణను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు సహా న్యాయవాదులను ముందుగానే ఆదేశించింది.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!