Sunil Bansal: భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్ నియమితులయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత) ఉన్న ఆయనను బుధవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ వెంటనే తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాల ఇన్‌ఛార్జిగా కూడా బాధ్యతలు అప్పగించారు. బన్సల్ నియామకానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆమోద ముద్ర వేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ తెలిపారు. అయితే భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఇప్పటివరకు ఉన్న తరుణ్‌ఛుగ్ స్థానంలోనా.. కాదా అనే అంశంపై స్పష్టత లేదు.
పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలు కూడా దీనిపై పూర్తిగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు 12వ తేదీన తాను రాష్ట్రానికి వస్తున్నట్లు తరుణ్‌ఛుగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డితో చెప్పినట్లు సమాచారం. దీంతో చుగ్‌ను రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తారని, బన్సల్‌ను సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించారని పార్టీ నేతలు కొందరు అంటున్నారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సునీల్ బన్సల్ ఆర్‌ఎస్‌ఎస్‌లో స్వయం సేవక్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రచారక్‌గా ఏబీవీపీలో జాతీయస్థాయి బాధ్యతల్లో ఉన్న ఆయనను అమిత్‌షా ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకువచ్చారు. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బన్సల్ 2014, 2019 లోక్‌సభ ఎన్నికలు... 2017, 2022 శాసనసభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశాలపై భాజపా కొంతకాలంగా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించిందని పార్టీ వర్గాలంటున్నాయి.
ఇవీ చూడండి..
హైదరాబాద్‌లో తగ్గిపోతున్న గృహ అమ్మకాలు..
'సారూ.. ఈ తిండి ఎలా తినగలం?'.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్!