ఆధార్ అనుసంధానం లేని ఫోన్ల నుంచి కూడా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా దోస్త్ ద్వారా సుమారు 1.90 లక్షల మంది డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందుతున్నారు. అందుకు రాష్ట్రవ్యాప్తంగా సహాయ కేంద్రాలు, మీ సేవా కేంద్రాలతో పాటు ఆధార్ అనుసంధానం ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
కరోనా నేపథ్యంలో ఈసారి బయోమెట్రిక్ హాజరు లేకుండా, ఆధార్ అనుసంధానం లేని ఫోన్ల నుంచి కూడా రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇస్తామని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే దోస్త్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఇంటర్ మార్కుల మెమోపై దోస్త్ సమాచారం ముద్రిస్తున్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ఈసారి సామాజిక మాధ్యమాలను గరిష్ఠంగా వినియోగించుకోనున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా సమాచారం ఇస్తారు. విద్యార్థుల నుంచి సూచనలు స్వీకరిస్తారు.