MBBS joining with Fake Certificates : ఇటీవల ఒక విద్యార్థిని ఎంబీబీఎస్‌లో చేరడానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు వచ్చింది. తనకు అఖిల భారత వైద్యవిద్య సీట్ల కేటాయింపులో ఇక్కడ సీటు లభించిందని పేర్కొంది. ధ్రువపత్రాలను, సీటు కేటాయింపు పత్రాన్ని పరిశీలించిన అధికారులకు అనుమానమొచ్చింది. మరిన్ని ప్రశ్నలను సంధించగా.. ఆమె అక్కడ్నించి జారుకుంది. ఈ క్రమంలో సదరు విద్యార్థిని నకిలీ పత్రాలతో వచ్చినట్లుగా అధికారులు నిర్ధారించినా.. అప్పటికే ఆ అమ్మాయి వెళ్లిపోవడంతో ఎలాంటి కేసూ పెట్టలేదని వైద్యవర్గాలు తెలిపాయి.
MBBS with fake documents : అచ్చంగా ఇలాంటిదే మరోటి నెల కిందట రాష్ట్రంలోనే జరిగింది. ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో రాష్ట్రస్థాయి ప్రవేశాల్లో భాగంగా కన్వీనర్ కోటాలో చేరడానికి ఒక విద్యార్థిని వచ్చింది. ఆమె ధ్రువపత్రాలు, సీటు కేటాయింపు పత్రాలను పరిశీలించగా.. ఆరోగ్యవర్సిటీ నుంచి అధికారిక సీటు కేటాయింపు పత్రం కాదని సందేహమొచ్చింది. ఆన్‌లైన్‌లో సరిచూసుకోగా.. అది నకిలీదని తేలిపోయింది. దీంతో కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థినిపై కేసు నమోదు చేయించినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు మూడు జరిగినట్లు, మూడింటిటిలో అమ్మాయిలే నిందితులని అవి తెలిపాయి. ఈ తరహా మోసమే ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ చోటుచేసుకుంది. నోయిడాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరేందుకు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) సీటు కేటాయింపు పత్రాన్ని ఇచ్చినట్లుగా ఓ విద్యార్థి ధ్రువపత్రాన్ని తీసుకొచ్చాడు. అఖిల భారత కోటాలో సీటు వచ్చిందని చెప్పాడు. సాధారణంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) ఆధ్వర్యంలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. కేటాయింపు పత్రాన్నీ ఎంసీసీనే ఇస్తుంది. అనుమానించిన అధికారులు విషయాన్ని ఎన్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌ఎంసీ అధికారులు అది నకిలీదని తేల్చారు. సత్వరం ఇలాంటి మోసాలను అరికట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాము ఎలాంటి సీటు కేటాయింపు పత్రాలనూ జారీ చేయలేదంటూ సోమవారం జాతీయ వైద్య కమిషన్ అన్ని రాష్ట్రాల ఆరోగ్యవర్సిటీలకు లేఖలు రాసింది.
కఠిన చర్యలు తప్పవు : నకిలీ సీటు కేటాయింపు పత్రాలను సృష్టిస్తున్న అంశం వెలుగులోకి రావడంతో జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా కొందరు విద్యార్థులు నకిలీ సీటు కేటాయింపు పత్రాల్ని తీసుకొని నేరుగా వైద్య కళాశాలలనే సంప్రదిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఎన్‌ఎంసీ ప్రకటించింది. వైద్యవిద్య ప్రవేశాలు రెండు రకాలుగా జరుగుతున్నాయి. ఒకటి.. రాష్ట్రంలోనే ఆరోగ్యవర్సిటీల ఆధ్వర్యంలో జరుగుతుండగా.. రెండోది.. అఖిల భారత స్థాయిలో ఎంసీసీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. రెండు విధానాల్లోనూ.. ప్రతి విడత కౌన్సెలింగ్‌లో సీటు కేటాయింపు అనంతరం ప్రవేశాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. దీంతో మోసం చేయాలనుకున్నా.. పట్టుబడడానికే అవకాశాలెక్కువని వైద్యవర్గాలు తెలిపాయి. మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఎంసీ ప్రకటించింది.
ఇవీ చదవండి :