రాష్ట్రంలో లాక్‌డౌన్ పక్కాగా అమలవుతోంది. పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో సీపీ అంజనీకుమార్ మదీనాగూడ చెక్‌పోస్ట్‌ను పరిశీలించారు. ప్రజలు నిబంధనలు పాటిస్తున్నారన్న అంజనీకుమార్... అతిక్రమిస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. నగరంలో 180చెక్‌పోస్టుల వద్ద పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలుచేస్తున్నామన్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్... ఇప్పటివరకూ నిబంధనలు అతిక్రమించిన వారిపై 56వేల 466 కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
అనవసరంగా రోడ్లపై తిరిగితే అంతే...
జిల్లా కేంద్రాలు ఇతర పట్టణాల్లోనూ లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. సడలింపుల సమయం ముగిసిన తర్వాత ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపడుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్నతాధికారులు స్వయంగా లాక్‌డౌన్ అమలును పర్యవేక్షించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల సహా పలు చోట్ల అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నవారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. మంచిర్యాలలోని వీధుల్లో అనవసరంగా తిరుగుతున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని... వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రోడ్లపై తిరగకుండా కౌన్సెలింగ్ ఇచ్చారు.
సడలింపుల సమయంలో రద్దీ
లాక్‌డౌన్ కట్టుదిట్టంగానే అమలవుతున్నా... సడలింపుల సమయంలో పెద్దసంఖ్యలో జనం రోడ్లపైకి వస్తున్నారు. మార్కెట్లు, బ్యాంకులు, నిత్యావసర సరుకులు దుకాణాలు రద్దీగా మారుతున్నాయి.
ఇదీ చదవండి: Investigation : రాష్ట్రంలో వ్యాక్సిన్ల వృథాపై విజిలెన్స్ విచారణ