ఈఎస్ఐ కుంభకోణంలో తవ్వేకొద్ది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఐదేళ్ల కాలంలో ఐఎంఎస్ ద్వారా దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చు చేయగా అందులో రూ.200 కోట్లు అవినీతి జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు భావిస్తున్నారు.
దొంగలంతా ఉన్నతాధికారులే..?
దోచుకున్న డబ్బుతో బినామీల పేరున ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా గుర్తించింది. కార్మికశాఖలోని కొందరు ఉన్నతాధికారులకూ కొంత సొమ్ము ముట్టినట్లు అనుమానించారు. అయితే వీటికి సంబంధించిన ఆధారాలు సేకరించలేకపోయారు.
లెక్క తేలటం లేదు
ఐదేళ్ల కాలంలో కొల్లగొట్టారని భావిస్తున్న సొమ్ముకి, నిందితుల ఆస్తులకు పొంతన కుదరడం లేదు. నిందితులను ప్రశ్నించినా ఈ విషయాలపై వివరాలు రాబట్టలేకపోయారు. ఒకవైపు అనిశా దర్యాప్తు కొనసాగుతుండగానే ఆస్తుల గుట్టు విప్పేందుకు ఈడీ రంగంలోకి దిగింది.
దోచుకున్న డబ్బు ఎక్కడ..?
కుంభకోణంలో నిందితుల ఆస్తుల విషయాన్ని ఈడీ విచారించనుంది. దోచుకున్న డబ్బును ఎటు మళ్లించారో తెలుసుకుని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద అధికారులు కేసు నమోదు చేశారు.
ఈడీ కస్టడీకి దేవికారాణి..
తొలుత దేవికారాణిని అదుపులోకి తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు.. న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ, రేపు ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తిస్తే.. వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ భావిస్తోంది.