సాటి మనిషికి కష్టమొస్తేనే పట్టించుకోని ఈ రోజుల్లో.. గాయపడ్డ విష సర్పానికి చికిత్స చేసి.. అడవిలో వదిలిపెట్టి మంచితనాన్ని చాటుకున్నారు కొంతమంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గాయపడిన నాగుపాముకు కుట్లు వేసి.. కోలుకున్నాక సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు.
ఐదున్నర అడుగుల సర్పం రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం కిందపడి గాయపడింది. దవడ చిధ్రమైంది. గంటసేపు రోడ్డుపై అలాగే ఉండిపోయింది. జైన్ సేవా సమితి అధ్యక్షుడు, సర్ప సంరక్షకుడు విక్రమ్ జైన్ అక్కడికి వచ్చి పామును తీసుకెళ్లి.. వణ్యప్రాణి విభాగం వైద్యుడు ఫణీంద్రకు చూపించారు. చిధ్రమైన దవడ భాగానికి సుమారు గంట సేపు చికిత్స చేసి..12 కుట్లు వేశారు. కాస్త కోలుకున్న తర్వాత మరో సర్ప రక్షకుడు ఈశ్వరరావు నాగుపామును అడవిలో వదిలిపెట్టారు.