కరోనా ప్రభావం తీవ్రత... ప్రవేశ పరీక్షలపై పడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల నుంచి జరగాల్సిన ఎంట్రెన్సులు షెడ్యూలు ప్రకారం జరగడం అనుమానంగా కనిపిస్తోంది. జూన్‌లో రెండు, జులైలో 2, ఆగస్టులో 4 ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలును ప్రకటించారు.
వచ్చే నెలలో కష్టమే..
పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 1 నుంచి జరగాల్సి ఉన్నా వాయిదా వేశారు. ఇప్పటి వరకు పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమే కాలేదు. దీంతో జూన్ 12న జరగాల్సిన పాలిసెట్ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. బీపెడ్, డీపెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 7 నుంచి పీఈసెట్ జరగాల్సి ఉంది. పీఈసెట్‌లో దేహధారుడ్య పరీక్షలు జరగాల్సి ఉన్నందున.. వచ్చే నెలలో నిర్వహించడం కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 22 వరకు పొడిగించారు.
ఎంసెట్, ఎంఫార్మసీ ప్రవేశాల కోసం వచ్చే నెల 19 నుంచి 22 వరకు పీజీఈసెట్ జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు జేఎన్టీయూహెచ్.. బీటెక్, బీఫార్మసీ పరీక్షలపై స్పష్టత రాలేదు. కాబట్టి షెడ్యూలు ప్రకారం పీజీఈసెట్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది.
విద్యార్థుల్లో ఉత్కంఠ..
బీటెక్, బీఫార్మసీ ప్రవేశాల కోసం జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ జరగాల్సి ఉంది. ఎంసెట్ కోసం ఇప్పటికే సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దరఖాస్తుల గడువు ఈనెల 26 వరకు పొడిగించారు. షెడ్యూలు ప్రకారం ఎంసెట్ కొనసాగుతుందా లేదా అని విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ జూన్‌లో జరగాల్సిన ఒకటి, రెండు ప్రవేశ పరీక్షలు వాయిదా పడినా జులైలో జరగాల్సిన ఈసెట్, ఐసెట్, లాసెట్, పీజీఎల్ సెట్ పై కూడా ప్రభావం చూపనుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ దాదాపు వాయిదా!
ఈనెల 28న జరగాల్సిన టీఎస్ఆర్జేసీని వాయిదా వేసిన గురుకుల సొసైటీ.. దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించింది. జేఈఈ మెయిన్ ఏప్రిల్, మే నెల పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ మెయిన్ నిర్వహించే 15 రోజుల ముందు... తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. రెండు పరీక్షలు ఉంటాయా.. ఒకే పరీక్షతో ముగిస్తారా అనే సందేహం విద్యార్థుల్లో నెలకొంది. వాయిదా పడిన జేఈఈ మెయిన్ పై ఇప్పటికీ స్పష్టత రానందున.. జులై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్ దాదాపు వాయిదా పడే అవకాశం ఉంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే క్లాట్ వాయిదా పడింది.
ప్రవేశ పరీక్షల షెడ్యూలు ప్రకారం కొనసాగుతాయా వాయిదా పడతాయా అనే అంశంపై అధికారుల్లోనూ అస్పష్టత నెలకొంది. కొవిడ్ తీవ్రతను బట్టి నిర్ణయాలు ఉంటాయని.. ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే.. వాయిదా పడే అవకాశాలే ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఇవీచూడండి: ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు: కేసీఆర్