హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పుర్ పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారిడార్ల పరిధిలో సమీకృత పెట్టుబడుల ప్రాంతాలు (ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్స్), పారిశ్రామిక ప్రాంతాలు (ఇండస్ట్రియల్ ఏరియాస్), పార్కులు, టౌన్‌షిప్‌లు, లాజిస్టిక్స్ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టనుంది. వీటి కోసం అనువైన భూములను వెంటనే గుర్తించి, నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆయా కలెక్టర్లను ఆదేశించింది. స్థానికంగా వనరులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని భూములను ఎంపిక చేయాలని సూచించింది.
నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. వీటికి కేంద్ర ప్రభుత్వ సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ కారిడార్ల సంభావ్యతపై ఇప్పటి వరకు అధ్యయనం చేసిన ప్రభుత్వం తాజాగా వీటి కార్యాచరణపై దృష్టి సారించింది. హైదరాబాద్-నాగ్‌పుర్ మార్గంలో మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్నాయి. హైదరాబాద్-వరంగల్ మార్గంలో రంగారెడ్డి, నల్గొండ, భువనగిరి, జనగామ, వరంగల్ గ్రామీణ, నగర జిల్లాలున్నాయి.
జాతీయ రహదారులకు రెండువైపులా..
పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం జాతీయ రహదారులకు రెండువైపులా గల ప్రభుత్వ భూములను గుర్తించాలని పరిశ్రమల శాఖ కలెక్టర్లను ఆదేశించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులు, రోడ్డు, రైల్వే సౌకర్యం, నీటి సరఫరా, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కొండలు, గుట్టలు, అటవీ భూములు కాకుండా ఇతర భూములనే ఎంపిక చేయాలని పేర్కొంది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే ప్రైవేటు భూములను గుర్తించి, వాటి బహిరంగ మార్కెట్ ధర, ప్రభుత్వ ధరలను తెలపాలని సూచించింది. ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉన్న వనరులు, పరిశ్రమల వివరాలను సైతం పంపించాలంది. భూములను గుర్తించిన తర్వాత ఆయా ప్రాంత చిత్రాలు (లొకేషన్ మ్యాప్‌లు) తయారు చేసి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీఎస్‌ఐఐసీకి) పంపించాలని నిర్దేశించింది.