ఆటోమొబైల్ షోరూమ్లు, విడిభాగాల దుకాణాలకు ప్రభుత్వం మినహాయింపునివ్వడంతో వాటిని తెరిచేందుకు యజమానులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మార్గనిర్దేశకాలు రానందున... సోమవారం నుంచి షాపులు తెరుస్తామని తెలంగాణ ఆటోమొబైల్స్ డీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్త తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2వేల ఆటోమొబైల్ షోరూమ్లు, విడిభాగాల దుకాణాలున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న షాపులు ఇప్పటికే తెరుచుకున్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలో మాత్రం వీటికి ప్రభుత్వం నిన్నటి నుంచే మినహాయింపునిచ్చింది. నగరంలో అక్కడక్కడ దుకాణాలు తెరిచినప్పటికీ... రామ్ కోఠి, రాణిగంజ్, ఫీల్ ఖానా, అఫ్జల్ గంజ్, ఎర్రగడ్డ, జీడిమెట్లలోని షాపులకు మాత్రం పోలీసులు అభ్యంతరం తెలిపారు.
దేశంలో దిల్లీ తర్వాత రామ్ కోఠిలో అత్యధికంగా ఆటోమొబైల్ రంగంలో ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. రామ్ కోఠిలో 250కి పైగా విడిభాగాల దుకాణాలున్నాయి. షాపులు తెరిచే సమయం, భౌతిక దూరం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసులు సూచించిన తర్వాత దుకాణాలు తెరుస్తామని యజమానులు తెలిపారు.
ఇదీ చదవండి: 'కరోనా దృష్ట్యా శంషాబాద్ విమానాశ్రయంలో సమూల మార్పులు'