గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. వరంగల్, ఖమ్మం నగరపాలికలు, అచ్చంపేట పురపాలిక పాలకమండళ్ల గడువు మార్చి 15తో, సిద్దిపేట గడువు ఏప్రిల్ 16తో ముగియనుంది. నకిరేకల్ గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు పూర్తి కావడం వల్ల పురపాలికగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు ఇటీవలే పురపాలికగా మారింది. దీంతో వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో కీలకమైన వార్డుల పునర్విభజన చేపట్టడంతో పాటు వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. గడువు లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున పునర్విభజన, రిజర్వేషన్లు పూర్తి చేయాలని పురపాలకశాఖకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.
కొత్త చట్టంతో పెరిగిన వార్డులు
కొత్త పురపాలక చట్టం ప్రకారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య 58 నుంచి 66కు, ఖమ్మంలో 50 నుంచి 60కి పెరిగాయి. సిద్దిపేటలో 34 నుంచి 43కు పెరిగాయి. అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరులోనూ వార్డుల పునర్విభజన చేయాల్సి ఉంది. పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి ప్రభుత్వం నుంచి సమ్మతి లభిస్తే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చి లోపు ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. అటు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 15వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటిస్తుంది. ఆ జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: 'సీఎస్ బిజీగా ఉంటే రెవెన్యూ శాఖను వేరొకరికి అప్పగించండి'