రాష్ట్ర బడ్జెట్ సోమవారం ఉభయసభల ముందుకు రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే శాసనసభ, మండలిని సమావేశపరుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. నేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టడంతోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
తుదిదశకు రాష్ట్ర బడ్జెట్ కసరత్తు
మరోవైపు బడ్జెట్ కసరత్తు తుదిదశకు చేరింది. ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను రూపొందించాలని, పూర్తి వాస్తవిక కోణంలో ఉండాలని అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా అధికారులు ఆయా శాఖల వారీగా మరోమారు కసరత్తు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిన్న మరోమారు అధికారులతో సుదీర్ఘంగా సమావేశమైన ముఖ్యమంత్రి.. బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులపై సమీక్షించారు.
రాబడులు, కేంద్ర నిధుల ఆధారంగా కేటాయింపులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సొంత పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన పన్నుల వాటా, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధుల విషయమై చర్చించారు. బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశమయ్యే అవకాశం ఉంది.