రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యార్థులందరూ.. వార్షిక పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ఎఫ్ఏ పరీక్షలో 20కి వచ్చిన మార్కులను అయిదింతలు చేసి తుది మార్కులు కేటాయించి గ్రేడ్లు ఖరారు చేశారు. పరీక్ష రుసుము చెల్లించిన 5 లక్షల 21 వేల 73 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. గతంలో ఫెయిలై ఈ ఏడాది పరీక్ష ఫీజు చెల్లించిన 4 వేల 495 మంది కూడా ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 62 వేల 917 మంది బాలురు.. 2 లక్షల 53 వేల 661 మంది బాలికలు ఉన్నారు. నలభై శాతానికి పైగా పదికి పది జీపీఏ సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 10 వేల 647 మంది విద్యార్థులు పది జీపీఏ దక్కించుకున్నారు. మొత్తం 421 ప్రైవేట్ బడులు సహా 535 పాఠశాలల్లో విద్యార్థులందరూ టెన్ బై టెన్ జీపీఏ సాధించారు.
పదో తరగతి ఫలితాలను bse.telangana.gov.in, results.bsetelangana.org లో చూసుకోవచ్చునని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలను పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా తీసుకోవాలన్నారు. ఏవైనా పొరపాట్లు ఉంటే ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు పంపిస్తే సరిచేస్తామని మంత్రి వివరించారు. డిజిటల్ తరగతులను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రికి విద్యా రంగం పట్ల ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనమని మంత్రి అన్నారు. కరోనా తీవ్రత కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో సీఎం ఆదేశాల మేరకు ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మంచి కోర్సులను ఎంపిక చేసుకొని భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.