ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 7వ తేదీ స్వామి వారి ధ్వజారోహణం, 8న భూతరాత్రిన భూత, శుకవాహనాలు, 9న గాంధర్వరాత్రి రోజున రావణ, మయూర వాహనాలు, 10న నాగరాత్రి సందర్భంగా శేష, యాళీ వాహనాలు, 11న మహాశివరాత్రి రోజు నంది, సింహవాహన సేవలు, అర్ధరాత్రిన లింగోద్భవ దర్శనం, 12న బ్రహ్మరాత్రి సందర్భంగా ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం జరగనున్నాయి.
13న స్కంధరాత్రిని పురస్కరించుకుని గజ, సింహవాహనాలపై స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, 14న ఆనందరాత్రిన శివకామసుందరి సమేత నటరాజస్వామి కల్యాణం, 15న రుషిరాత్రి సందర్భంగా స్వామి, అమ్మవార్ల కైలాసగిరి ప్రదక్షిణోత్సవం, రాత్రి అశ్వ, సింహ వాహన సేవలు, 16న దేవరాత్రి సందర్భంగా ధ్వజావరోహణం జరగనుంది. ప్రత్యేకోత్సవాలుగా 17న పల్లకీసేవ, 18న శయనోత్సవ మండపంలో ఏకాంతసేవ విశేషోత్సవాన్ని జరపనున్నారు. 19వ తేదీన శాంతి అభిషేక ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
అగ్రగణ్యుడు.. కన్నప్ప నయనార్
నయనార్లుగా పిలిచే శివభక్తుల్లో ప్రథముడు భక్తకన్నప్ప. ముక్కంటికి తన రెండు కళ్లను భక్తితో సమర్పించుకున్న భక్త కన్నప్ప ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. ఆలయాన్ని ఆనుకుని ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణులపై కొలువుదీరిన భక్త కన్నప్ప, కైలాసనాథ స్వామి ఆలయం వద్ద శనివారం సాయంత్రం ఈ ధ్వజారోహణ ఘట్టాన్ని చేపట్టి వార్షిక ఉత్సవాలను ప్రారంభించనున్నారు.