ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాదాపు 400 మంది కువైట్లో చిక్కుకున్నారు. వీరంతా వివిధ పనుల కోసం అరబ్ దేశానికి వెళ్లినవారు. లాక్ డౌన్ కారణంగా ఆయా కంపెనీలు మూసేయటంతో వీరు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో సంతబొమ్మాళి, కంచిలి, హిరమండలం, వజ్రపుకొత్తూరు, సోంపేట ప్రాంతాలకు చెందిన వారు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక చిన్న గదిలో 100 మంది వరకు ఉంటున్నామని వాపోయారు.
స్వదేశానికి పంపించమని అక్కడి అధికారులను అడిగితే స్పందన లేదని.. పైగా మళ్లీ అడిగితే జైల్లో పెడతామంటూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను స్వదేశానికి రప్పించాల్సిందిగా వేడుకుంటున్నారు.