రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, మహిళల ఉన్నత విద్య కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలు, ప్రొఫెషనల్ కళాశాలలు ప్రారంభించాలని, మండలానికో సెమీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం (సెస్) సర్వేలో వెల్లడైంది. అన్ని యాజమాన్యాల పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఒకేరకమైన సౌకర్యాలు కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. పేద, వెనుకబడిన వర్గాలు తమ పిల్లలను సంక్షేమ గురుకులాల్లో చదివించేందుకు ఇష్టపడుతున్నారని వెల్లడించింది.
వెనుకబడి ఉన్నారు
ఎస్సీ విద్యార్థులు చదువు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వెనుకబడి ఉన్నారని వివరించింది. రాష్ట్రంలో సాధారణ, ఎస్సీ గురుకులాలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ఆకాంక్షలు, ఆలోచనలపై సెస్ చేసిన సర్వే ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
- జడ్పీ పాఠశాలలు, గురుకులాల్లో సరైన మౌలిక సదుపాయాల్లేవు. విద్యార్థులు నేలపై, వరండాలో కూర్చుని చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల్లో సమయపాలన లోపించింది. కొన్ని చోట్ల వాలంటీర్లే బోధిస్తున్నారు.
- గురుకులాల్లో విద్యార్థులకు పడకలు, పుస్తకాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి.
- ఎక్కువ సంఖ్యలో జూనియర్, డిగ్రీ గురుకులాలు ప్రారంభించాలి.
- నెలకు రెండు సార్లు ఉన్నతాధికారులు పాఠశాలలను సందర్శించి, తనిఖీ చేయాలి.
- ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టాలి. మధ్యాహ్న భోజన పథకం పటిష్ఠం చేయాలి.
- మండలానికో సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించాలి.