తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. వారికి మెరుగైన వసతి సౌకర్యాలు కల్పనతో పాటు దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం, సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొంది.
అంతటి ప్రాముఖ్యత ఉన్న సన్నిధిలో సేవలు అందించాలన్నది చాలామంది ఉద్యోగుల కల. అలాంటి ధార్మిక సంస్థలో ఐఏఎస్ అధికారి సదా భార్గవి... జేఈవోగా బాధ్యతలు చేపట్టారు. తితిదే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ మహిళా అధికారి జేఈవోగా బాధ్యతలు చేపట్టి తనదైన పంథాలో విధులు నిర్వహిస్తూ మన్ననలు పొందుతున్నారు. కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ గత ఏడాది మే 20న జేఈవోగా బాధ్యతలు చేపట్టిన సదా భార్గవి... తితిదేలో పలు ముఖ్యమైన విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ విధి నిర్వహణలో రాణిస్తున్నారు. విద్య, వైద్యం, సంక్షేమంతో పాటు శ్రీవారి ఆస్తులను పరిరక్షించే ఎస్టేట్ విభాగ బాధ్యతలను చూస్తున్నారు. దేవుని ఆస్తిపాస్తులు కాపాడేందుకు వివిధ చర్యలు చేపట్టారు.
జేఈవోగా బాధ్యతలు చేపట్టే సమయానికి శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. వెంటనే దేశ వ్యాప్తంగా తితిదే ఆస్తుల వివరాలను సేకరించిన భార్గవి.... శ్వేతపత్రం విడుదలకు తన వంతు కృషి చేశారు. ఉన్నత అధికారుల అండ..తోటి ఉద్యోగుల సహకారంతో పనిచేసినట్లు భార్గవి చెబుతున్నారు. తితిదే చరిత్రలో తొలి మహిళా జేఈఓగా అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు సదా భార్గవి. తనకు లభించిన అరుదైన అవకాశాన్ని మరింత వినియోగించుకుని దేవునికి సేవ చేస్తానని చెబుతున్నారు.
ఇదీ చూడండి: కామాక్షి అమ్మవారి సమేతంగా శేషవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు