చరిత్రకు నిదర్శనంగా నిలిచే గోల్కొండ ఖిల్లాలోని ఓ రాతి గుహలో భక్తులకు దర్శనమిస్తుంది జగదాంబ మహంకాళి దేవి. ఆషాఢమాసంలో బోనాల పండుగ ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే కావడం విశేషం. కోరిన కోర్కెలు తీర్చే శక్తిస్వరూపిణిగా పూజలు అందుకునే ఈ దేవిని దర్శించుకుని బోనం సమర్పిస్తే ఆ సంవత్సరమంతా తాము సుఖసంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. ఒకప్పుడు ఇక్కడ పశువులు కాసే రామ్‌దేవ్ రావ్ అనే వ్యక్తికి ఈ ప్రదేశంలో దేవి విగ్రహం కనిపించిందట. అది తెలిసి కాకతీయులు ఇక్కడ చిన్న ఆలయాన్ని కట్టించారనీ.. అలా ఈ ప్రాంతానికి గొల్లకొండ అనే పేరు వచ్చిందనీ అంటారు. నవాబులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. సాధారణంగా ఈ మాసంలో వచ్చే నాలుగు లేదా అయిదు ఆదివారాల్లోనే పలు ఆలయాల్లో దేవికి బోనాలను అర్పిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆషాఢంలో వచ్చే ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు.
ఆ ఆలయ స్ఫూర్తితోనే... తన చల్లని చూపులతో భక్తుల కోర్కెలు తీర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటోంది సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి. ఢమరుకం, కత్తి, శూలం, అమృత పాత్ర ధరించి చతుర్భుజిగా దర్శనమిచ్చే ఈ దేవిని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయనేది భక్తుల నమ్మకం. ఏడాది మొత్తం విశేష పూజలు జరిగే ఈ ఆలయాన్ని జంటనగరాల నలుమూలల నుంచీ లక్షలాది మంది దర్శించుకుంటారు. సుమారు రెండువందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళి పేరు పెట్డడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు పాత బోయగూడలో సురిటి అప్పయ్య అనే అమ్మవారి భక్తుడు ఉండేవాడట. మిలటరీలో పనిచేసే అప్పయ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడట. ఆ సమయంలో అంతటా కలరావ్యాధి విపరీతంగా ప్రబలి చాలామంది చనిపోయారట. ఇది తెలిసిన అప్పయ్య మహాకాళి ఆలయానికి వెళ్లి దేవిని దర్శించుకుని కలరా వ్యాధిని తగ్గిస్తే తన స్వస్థలంలోనూ అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తానంటూ మొక్కుకున్నాడట. క్రమంగా ఆ సమస్య అదుపులోకి వచ్చిన కొన్నాళ్లకు స్వస్థలానికి వచ్చేసిన అప్పయ్య సికింద్రాబాద్‌లోనే చిన్న ఆలయాన్ని నిర్మించి చెక్క విగ్రహాన్ని ఏర్పాటుచేశాడట. అయితే... ఆ సమయంలో జరిపిన తవ్వకాల్లో మాణిక్యాలమ్మ దేవి విగ్రహం కూడా బయటపడటంతో ఆ రెండు విగ్రహాలనూ కలిపి ప్రతిష్ఠించాడట.
చివరి బోనం ఇక్కడే
భక్తుల కష్టాలను పోగొట్టే ఆదిపరాశక్తిగా, నగరాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే పరమేశ్వరిగా పూజలు అందుకునే దేవి హైదరాబాద్ పాతనగరంలోని లాల్‌దర్వాజాలో కొలువైన సింహవాహిని మహంకాళి. నిజాం నవాబులు నగరానికి రాకపోకలు సాగించేందుకు వీలుగా 13 దర్వాజాలను నిర్మించారనీ అందులో లాల్‌దర్వాజా ఒకటనీ అంటారు. ఆ తరువాత ఇక్కడ స్థానికులు ఆలయాన్ని కట్టించి, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. అది జరిగిన కొన్నాళ్లకు మూసీ నది ఉప్పొంగడంతో నిజాం రాజు ఇక్కడకు వచ్చి అమ్మవారిని పూజించి.. నీటిలో పట్టువస్త్రాలూ, కానుకలూ వదిలాకే మూసీ ఉధృతి తగ్గిందనీ.. అప్పటినుంచీ బోనాలు సమర్పించే సంప్రదాయం మొదలైందనీ అంటారు. కన్నుల పండుగ్గా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఏటా దాదాపు పదిలక్షలమందికి పైగా భక్తులు వస్తారని అంచనా. - మెంగా విజయ్‌కుమార్, న్యూస్‌టుడే, గోల్కొండ
ఇవీ చూడండి