ఏపీలోని బ్రహ్మంగారిమఠంలో పీఠాధిపత్యం సమస్య పరిష్కారానికి.. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ అధికారి నేడు మఠానికి చేరుకోనున్నారు. దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ప్రత్యేక విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఆయన మఠానికి చేరుకుని.. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి పెద్ద భార్య నలుగురు కుమారులు, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ, ఆమె ఇద్దరు కుమారులతో సమావేశమవుతారు. వారి అభిప్రాయాలు సేకరిస్తారు. ఏకాభిప్రాయం కుదరకపోతే.. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిబంధనలు అమలు చేస్తారో వారికి వివరించనున్నారు. గ్రామస్థులు, ధార్మిక సంఘాల అభిప్రాయాలనూ అధికారి సేకరిస్తారు. వీటన్నింటినీ నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తారు.
ప్రత్యేక అధికారి ఇచ్చే నివేదికను అనుసరించి.. ప్రభుత్వం ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో మఠాధిపతులతో కమిటీ వేయనుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బ్రహ్మంగారిమఠం పీఠాధిపతిని నియమించే అవకాశముంది. జులైలో పీఠాధిపతిని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యచరణపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం