మానవాళి మనుగడకు కరోనా పెను సవాల్ విసురుతోంది. ప్రపంచమంతా మృత్యుఘంటికలు మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనాతో విలవిల్లాడుతోంది. న్యూయార్క్‌లో సామూహిక దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రోజు రోజుకూ కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్. రామ కోటేశ్వరరావు టెక్సాస్ నుంచి ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. కరోనా విపరిణామాలు, భారత్‌లో లాక్‌డౌన్ అవసరాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...
ప్రశ్న: అడ్వాన్స్ మెడిసిన్ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత కాలంలో కరోనా వైరస్‌ను ఎదుర్కోవటంలో ఎందుకు విఫలం అవుతున్నాం...?
జవాబు : సార్స్, ఎబోలా, నిఫా, స్వైన్‌ఫ్లూ వంటి ఎన్నో వైరస్‌లను మనం చూశాం. ఆ వైరస్‌లు అంత ఉద్ధృతంగా వ్యాప్తిచెందలేదు. కానీ కరోనా చాలా వేగంగా, విస్త్రృతంగా వ్యాపిస్తోంది. ఒక వ్యక్తికి సోకిన కరోనా లక్షణాలు... వెలుగు చూసే లోపే చాలా మంది దాని బారిన పడుతున్నారు. గతంలో వచ్చిన ఏ వైరస్‌లు కూడా ఈ స్థాయిలో వ్యాపించలేదు. అడ్వాన్స్ మెడిసిన్ అందుబాటులో ఉన్నప్పటికీ... కరోనా కట్టడి అంత సులభంగా లేదు. పైగా ఈ వైరస్ లక్షణాలు వెలుగు చూసే సమయానికే నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం పడి... వెంటిలేటర్‌పై ఉంచాల్సిన స్థితికి రోగి చేరుకుంటున్నారు.
ప్రశ్న : ఎబోలా, సార్స్‌ను అరికట్టినట్లే కరోనాను ఎందుకు నివారించలేకపోతున్నాం...?
జవాబు: ఎబోలా వైరస్ వ్యాప్తి ఇంతలా లేదు. అది తుమ్మినా, దగ్గినా ఇతరులపై తక్కువ ప్రభావం చూపింది. కానీ కరోనా తుమ్మినా, దగ్గినా, ఒకర్ని ఒకరు అంటుకున్నా ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. పైగా కరోనా వ్యాధి లక్షణం ఇదే అని కూడా స్పష్టంగా నిర్ధరణ లేదు. కొందరిలో ఏ లక్షణాలు లేకున్నా పరీక్షల్లో కరోనా పాజిటివ్ వస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఒక చోట నుంచి మరోచోటకి ప్రయాణించడం వల్ల ఇతర దేశాలకు ఎంతో వేగంగా అంటుకుంది. అందుకే దేశాలన్నీ ఎప్పుడూ లేని విధంగా లాక్‌డౌన్ ప్రకటించాయి. గత రెండు వారాలుగా భారత్ కూడా లాక్‌డౌన్ పాటిస్తోంది. కానీ అమెరికాలో ప్రారంభంలో అన్ని చోట్లా లాక్ డౌన్ విధించలేదు. ఇతర దేశాలతో ఎక్కవ సంబంధాలు ఉన్న న్యూయార్క్‌లో దీని ప్రభావం అధికంగా ఉంది. న్యూయార్క్‌లో జన సాంధ్రత కూడా చాలా ఎక్కువ. అక్కడ జనజీవనంలో రాత్రి పగలు అన్న తేడా ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
ప్రశ్న : కరోనా సోకిన వ్యక్తిని వెంటిలేటర్‌పై ఉంచాల్సినంత తీవ్రత ఎందుకు ఉంటుంది....?
జవాబు: కరోనా వచ్చిన వ్యక్తికి మొదట దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులు ఉంటాయి. ఈ లక్షణాలు ఒకటి రెండు రోజుల్లోనే తీవ్రంగా మారతాయి. జ్వరం 102 నుంచి 104 డిగ్రీల వరకు ఉంటుంది. తర్వాత దాని తీవ్రత ఉపిరితిత్తులపైనే అధికం. ఊపిరితిత్తులు పాడవటం వల్ల మిగిలిన అవయవాలు కూడా దెబ్బతింటాయి. అందుకే వెంటిలేటర్ అవసరం ఎక్కువగా ఉంది.
ప్రశ్న : సాధారణంగా అందరికీ జ్వరం, దగ్గు, జలుబులు వస్తూనే ఉంటాయి...? ఇలాంటి వారంతా కరోనా వచ్చిందని భావించవచ్చా...?
జవాబు: జలుబు, దగ్గు, జ్వరం సాధారణమే కానీ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటం, జలుబు, దగ్గు అధికంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. తలనొప్పి, ఊపిరి ఆడకపోవటం కూడా ఉంటుంది. సైనస్ సమస్య ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి.
ప్రశ్న : అమెరికాలో కరోనా వచ్చిన వ్యక్తికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు. ఏ విధానాన్ని అవలంభిస్తున్నారు...?
జవాబు : కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని ముందు జాగ్రత్తగా.. పరీక్షల కన్నా ముందే ఐసోలేషన్‌లో ఉంచుతున్నాం. ఆ తర్వాతే కరోనా పరీక్షలు చేస్తున్నాం. ఒకవేళ అతనికి కరోనా పాజిటివ్ ఉన్నా...ఇతరులకు సోకకుండా చూడటమే ఇందుకు ప్రధాన కారణం. పాజిటివ్ సోకిన రోగి వద్దకు వెళ్లే వైద్యులు, సిబ్బంది కూడా కచ్ఛితంగా జాగ్రత్తలు పాటించాలి.
ప్రశ్న: అసలు కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్ అనేదే తారకమంత్రమా...? ఇది ఫలితాలను ఇస్తుందా...?
జవాబు : కచ్చితంగా లాక్‌డౌన్ తారకమంత్రమే.. అందుకు ఉదాహరణ భారతదేశమే. కరోనా పాజిటివ్ కేసులను భారత్ జనాభాతో పోల్చితే చాలా తక్కువ కేసులు వచ్చాయని స్పష్టమవుతుంది. లాక్ డౌన్ లేకపోతే ఈ పాటికే లక్షల్లో కేసులు నమోదు అయ్యేవి. వైద్య పరంగా మేం ఉండే అమెరికా.. అడ్వాన్స్‌లో ఉంది. కానీ కేసులు ఎక్కువగా వచ్చాయి. లాక్‌డౌన్ నిర్ణయం ఆలస్యమే కారణం. పైగా అమెరికాలో దేశీయ విమానాలు ఇంకా తిరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ చేసిన మన దేశంలో వ్యాప్తి నివారణ తక్కువగా ఉందనేది గమనార్హం.
ప్రశ్న : అమెరికాలో కరోనా రోగులకు ఎలాంటి వైద్యం, మందులు అందిస్తున్నారు...?
జవాబు: కరోనాకు ఇది సరైన మందు అని చెప్పడానికి ఏమీ లేదు. కొందరికి హైడ్రాక్సీ క్లోరోఫిన్, ఎజిత్రోమైసిన్ సహా మరో రెండు మూడు రకాల మందులు ఇస్తున్నాం.. కానీ ఇవి ఏమేరకు పనిచేస్తున్నాయో ఇప్పుడే చెప్పడం కష్టం. చైనా, ఇటలీల్లో వినియోగించిన మందులను వాడి చూస్తున్నాం.
ప్రశ్న : ఈ మందులతో పాటు ప్లాస్మా చికిత్స చేయాలంటున్నారు... ఈ విధానం ఫలితాలు ఇస్తుందా...?
జవాబు: ప్లాస్మా చికిత్స ప్రయోజనం ఉండొచ్చు. కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన వ్యక్తిలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్లను ఆయుధాలు నింపుకున్న సైనికుల్లా చెప్పొచ్చు. నిర్ధారించిన మందులు లేనందున ప్లాస్మా విధానాన్ని అవలంభించడంలో తప్పులేదు. అందుకే చికిత్స చేయవచ్చు. అమెరికాలోనూ చర్చలు కొనసాగుతున్నాయి..
ప్రశ్న : కరోనా అనుభవం నుంచి వైద్యసమాజం, పౌరసమాజం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి...?
జవాబు : జనాభా పెరుగుతోంది. మన ఆహార, ప్రయాణ అలవాట్లు అన్నీ మారిపోతున్నాయి. కాలుష్యం, వాతావరణ మార్పులు బాగా ఎక్కువగా మారిపోతున్నాయి. అందువల్ల భవిష్యత్‌లోనూ ఇలాంటి వైరస్‌లు ఎక్కువగా ఉద్భవించవచ్చు. కొత్త లక్షణాలతో వ్యాధి కనిపిస్తే ఇకపై ఐసోలేషన్ చేయడం ప్రాథమ్యంగా పెట్టుకోవాలి. మన జీవన విధానంలో, వ్యక్తిగతంగానూ మార్పులు చేసుకున్నప్పుడే మావన మనుగడ సాఫీగా, సక్రమంగా సాగుతుంది.