Dr Lathikanath Interview: రెండు పులి పిల్లలు. ఒక ఏనుగు వెనకే వెళుతూ.. దాన్ని ఆటపట్టిస్తున్నాయి. తోక కొరుకుతూ, కాళ్లకు అడ్డంపడుతూ దాన్ని ముందుకు సాగనివ్వట్లేదు. విసిగిన ఏనుగేమో నెమ్మదిగా వాటిని పక్కకు దొర్లిస్తోంది... అడవి జంతువుల్లో చిన్న పిల్లల మనస్తత్వం ఆశ్చర్యం కలిగించట్లేదూ? ఇలాంటి ఎన్నో సంఘటనలకి సాక్షి.. డాక్టర్ లతికానాథ్. మన దేశంలో తొలి మహిళా వైల్డ్‌లైఫ్ బయాలజిస్ట్. దశాబ్దాలుగా పులుల సంరక్షణకు పాటుపడుతోన్న ఈ ‘టైగర్ ప్రిన్సెస్ ఆఫ్ ఇండియా’తో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఈటీవీ-భారత్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఈ విధంగా తెలిపారు.
ఈ రంగంలోకి ఎందుకంటే... నాన్న లలిత్ ఎమ్ నాథ్ వైద్యుడు, పర్యావరణ ప్రేమికుడు కూడా. అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న పర్యావరణ పరమైన నిర్ణయాల్లో నాన్న పాత్రా ఉండేది. ఆయన్ను చూసే ఏడేళ్ల వయసులో బయాలజిస్టు అవ్వాలనుకున్నా. చిన్నప్పుడే డా.సలీం అలీ లాంటి ఎందరో పర్యావరణవేత్తలను కలిశా. నా మీద వీరందరి ప్రభావమూ ఎక్కువే. దిల్లీ విశ్వ విద్యాలయం నుంచి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పట్టా పొందా. మాస్టర్స్‌కి విదేశాలకు వెళ్లా. అదే సమయంలో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ఏర్పాటైంది. దాని సాయంతో రాజాజీ పార్క్ ప్రాంతంలో ఏనుగులు, మానవుల సంఘర్షణపై చేసిన నా పరిశోధనకు చాలా మంచి పేరొచ్చింది.
పులులపై ప్రేమ... డాక్టర్ ఛార్లెస్ మెక్ డౌగల్ తీసిన అరుదైన పులి ఫొటో ఒకటి మా ఇంట్లో ఉండేది. చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తూ ఉండేదాన్ని. పీజీ చేసి మన దేశానికి వచ్చాక కశ్మీర్, లద్దాఖ్‌ల్లో మంచు చిరుతలపై పరిశోధనకు ప్రయత్నించా. 90ల్లో అక్కడి ఉగ్రవాద పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాలేదు. అప్పటి డబ్ల్యూఐఐ డైరెక్టర్ డాక్టర్ హెచ్‌ఎస్ పన్వర్ ‘మన జాతీయ జంతువుపై దృష్టి పెట్టొచ్చుగా’ అన్నారు. ఇవన్నీ నాకు తెలియకుండానే పులల మీద ప్రేమ కలిగించాయి.
ప్రయాణం.. వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ వీబీ మాథుర్ మార్గదర్శకత్వంలో పులులపై పరిశోధన ప్రారంభించా. ఆయన అప్పట్లోనే జీఐఎస్ సాంకేతికతతో పులుల ఆవాసాల్ని మ్యాపింగ్ చేయాలనుకున్నారు. ఆ ప్రాజెక్టులో భాగమయ్యా. మధ్యప్రదేశ్ అడవుల్లో చేసిన ఈ ప్రాజెక్టు పులుల అభయారణ్యాలను గుర్తించడంలో ఇప్పటికీ సాయపడుతోంది. కానీ నేను ప్రారంభించే నాటికి వన్యప్రాణి సంరక్షణపై దేశంలో అవగాహన అప్పుడే మొదలైంది. దానికేమో నిధుల కొరత. ఆ సమయంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పులులపై పరిశోధనావకాశంతోపాటు 4 స్కాలర్‌షిప్‌లకూ ఎంపికయ్యా. ఐదేళ్ల పరిశోధన తర్వాత నా కలల డాక్టరేట్ దక్కింది. అది అందుకున్న తొలి భారతీయురాలిని నేనే. నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ నా మీద తీసిన ‘టైగర్ ప్రిన్సెస్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ గుర్తింపునీ తెచ్చింది. పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేశాక అవన్నీ పక్కన పెట్టి మధ్యప్రదేశ్ చేరుకున్నా. అటవీ ప్రాంతాల్లో నివసించే వారి వల్ల జంతువులకు కలిగే ముప్పు వంటి అంశాలపై అధ్యయనం చేశా. ఆ సమస్యల్లో ప్లాస్టిక్ కూడా ఒకటి. వీటన్నింటికీ పరిష్కార మార్గాలను ప్రయత్నించా. ప్లాస్టిక్ సమస్యకు గార్బేజ్ రీసైక్లింగ్ విధానం రూపొందించా. ఖాట్మండ్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తోంది.
ఇక్కడా ఉంటుంది... 90ల్లో మహిళలు ఎంచుకునే కెరియర్లు కొన్నే. కానీ మా బంధువుల్లో అందరూ శాస్త్రవేత్తలు, లాయర్లు, ప్రొఫెసర్లే. దీంతో నా పనిని అర్థం చేసుకున్నారు. అయితే అన్ని చోట్లా ఉన్నట్టు ఇక్కడా పురుషాధిక్యత ఉంటుంది. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో, అడవుల్లో పనిచేసేటప్పుడు ఏదైనా చెబితే ఒక అమ్మాయి చెప్పింది చేయాలా అన్నట్టు ప్రవర్తించేవారు. నేనవేవీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోయేదాన్ని. మగవాళ్లతో పోటీ అని కానీ, సమానంగా రాణిస్తున్నానని కానీ పేరు కోసం తహతహలాడలేదు. నా దృష్టంతా చేపట్టిన పనిని ఎంత బాగా చేస్తున్నాను అన్న దాని మీదే ఉంటుంది.
సవాళ్లు.. ప్రపంచంలో ఎన్నో సమస్యలుండగా పులులే ఎందుకని అడుగుతుంటారు. రాజసం ఉట్టిపడే జంతువిది. వీటికి సిగ్గు ఎక్కువ. రెచ్చగొడితే తప్ప దాడికి దిగవు. పైగా చూపును బట్టి వాటి మూడ్‌ను అంచనా వేసుకుని మసలుకోవడం ఓ కళ. దాన్ని ఆస్వాదిస్తా. వాటి కోసం ఎదురు చూసే క్రమంలో చలికి కాళ్లూ చేతులూ గడ్డకట్టడం, ఎండ వేడికి శరీరం బొబ్బలెక్కిన సందర్భాలెన్నో. పులి కనిపించాక మాత్రం అంత కష్టమూ మరిచిపోయేదాన్ని. నా జీవితంలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీదీ ప్రధాన పాత్రే. ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్స్ యునైటెడ్’లో సభ్యురాలిని. ‘సీతాస్ స్టోరీ’, ‘టేల్ ఆఫ్ టైగర్స్’ సినిమాలకు పనిచేశా. నా అనుభవాల్ని ‘హిడెన్ ఇండియా’, ‘ఓమో’ పుస్తకాలుగా తెచ్చా. ఈ రంగంలో ప్రమాదాలు, సవాళ్లు ఎక్కువే. ప్రేమ, అకుంఠిత దీక్ష ఉంటే అడ్డంకుల్ని దాటడం సులువే. మృగాలు, మనుషుల్ని ఏకకాలంలో సంరక్షించే ఈ ప్రయాణం మాత్రం సంతృప్తినిస్తుంది.