తెలంగాణలో.. ఎస్సీల సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం(Dalit Bandhu) అమలుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సంస్థకు బాధ్యతలు అప్పగించింది. వెబ్‌పోర్టల్‌తోపాటు యాప్‌ను ఈ నెలాఖరులోగా సిద్ధంచేసి ఆగస్టు తొలి వారానికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సీజీజీకి సూచించింది.
నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులు..
ఈ పథకం కింద నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల కోసం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారిని తొలి ప్రాధాన్యం కింద గుర్తించాలని, ఆ తర్వాత కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 26న దళిత బంధు అవగాహన కార్యక్రమంలో ఈ మేరకు విధివిధానాలు వెలువడే అవకాశముంది. సాంఘిక సంక్షేమ శాఖలో వివిధ పథకాల అమలుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.250 కోట్లు జమయ్యాయి. ఈ నిధులను దళిత బంధు కోసం ఖర్చుచేసే అవకాశమున్నట్లు సమాచారం.
స్వీయ ఆర్థిక సాధికారత కోసమే..
గత నెల 27న జరిగిన అఖిలపక్ష సమావేశంలో దళత సాధికారత పథకంపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. స్వీయ ఆర్థిక సాధికారత ద్వారా తమ అభివృద్ధిని తామే నిర్వచించుకుని, నిర్ణయించుకునేలా ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి యూనిట్ల(పరిశ్రమ/ఇతర వనరులు) ఏర్పాటుకు రూ.పది లక్షల ఆర్థిక సాయం చొప్పున ప్రతి నియోజకవర్గంలోనూ వంద కుటుంబాలకు ఇస్తామని ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రైతుబంధు మాదిరే సాయాన్ని ఎంపికైన కుటుంబాల పేరిట నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ఆ రోజున తెలియజేశారు. ఈ పథకంపై ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం తెలంగాణ దళితబంధు పథకం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో నంబర్ ఆరును జారీ చేసింది ఎస్సీ అభివృద్ధి శాఖ.
హుజూరాబాద్ నుంచే షురూ..
రైతుబంధు తరహాలోనే ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముందు నిర్ణయించిన ప్రకారమే రూ.1,200 కోట్లతో తెలంగాణ దళిత బంధు పథకం(Dalit Bandhu) రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని, అయితే పైలట్ ప్రాజెక్టు అయినందున హుజూరాబాద్‌కు అదనంగా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించారు.