Goods Trains in Passenger Railway Track : మొన్నటి వరకు కొవిడ్ ప్రత్యేక రైళ్ల పేరుతో అధిక ఛార్జీలను వసూలు చేసి ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా అధిక ఆర్జన కోసం ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడవాల్సిన ట్రాక్‌లో గూడ్సు రైళ్లను నడుపుతోంది. దీంతో సికింద్రాబాద్ నుంచి సకాలంలో రైళ్లు బయలుదేరడం లేదు. ఇదే విధంగా ఇక్కడకు రావాల్సినవి లైన్లు ఖాళీ లేక శివార్లలోనే ఆగిపోవాల్సి వస్తోంది. ఎంఎంటీఎస్ సర్వీసుల మీదా ఈ ప్రభావం పడుతోంది.
ప్రత్యేకంగా ఉన్నా..
southern central railway : ఎక్స్‌ప్రెస్, ఇతర ప్రయాణికుల రైళ్లకు ఆటకం కలగకుండా సనత్‌నగర్ నుంచి వయా అమ్ముగూడ స్టేషన్ మీదుగా మౌలాలి వరకు రెండు లైన్లు ఉన్నాయి. ఒక లైను ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లు మరో లైను కాజీపేట నుంచి ఇక్కడి వచ్చే గూడ్సు రైళ్ల కోసం వినియోగిస్తుంటారు. కొవిడ్ తర్వాత ప్రయాణికుల రైళ్లు నిలిచిపోవడంతో రైల్వే అధికారులు సనత్‌నగర్ నుంచి అమ్ముగూడ మీదుగా ఉన్న లైన్లలో కాకుండా సికింద్రాబాద్ మీదుగా ఉన్న ప్రయాణికుల రైళ్లు తిరిగే లైనులో గూడ్సు నడపడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల నుంచి అన్ని యథావిధిగా నడుస్తుండడంతో ప్రయాణికుల రైళ్లు సకాలంలో నడపలేని పరిస్థితి ఏర్పడుతోంది. లైన్లు ఖాళీ లేకపోవడంతో కొన్ని ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు ఫిర్యాదులు చేసినా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు.
కారణం ఇదీ..
Telangana Railway Tracks : ఇలా ఎందుకు చేస్తున్నారని ఆరాతీస్తే సనత్‌నగర్ నుంచి గూడ్సు రైళ్లను నడిపితే దూరం అధికంగా ఉంటుంది. సికింద్రాబాద్ మీదుగా నడిపితే దూరం తక్కువగా ఉండడంతో వ్యయం తగ్గి అధిక ఆదాయం ఆర్జించడానికి అవకాశం ఉంది. దీనిపై అధికారులను వివరణ అడిగితే గూడ్సు వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఏమీ లేవని చెబుతున్నారు.