కృత్రిమ మేథస్సు, సమాచార విశ్లేషణకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు కోసం దక్షిణ మధ్య రైల్వే మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహకారంతో ఒప్పందం చేసుకుంది. సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన వర్చువల్ సమావేశంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ సమక్షంలో... ఎస్‌సీఆర్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అంగీకార పత్రంపై సంతకం చేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిప్యూటీ డీన్ మిలింద్ సోహన్‌కు అందజేశారు. భారతీయ రైల్వే ఐఎస్‌బీ భాగస్వామ్యంతో సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగవచ్చునని వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఐఎస్‌బీ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ఇది తగిన సమయమని జీఎం గజానన్ మాల్యా వ్యాఖ్యానించారు. సరికొత్త సాంకేతికత పరిజ్ఞాన వినియోగంతో వనరును గరిష్ఠంగా ఉపయోగిస్తూ మరింత ప్రభావంతంగా పనిచేయగలుతామని అభిప్రాయపడ్డారు. భారతీయ రైల్వే ప్రత్యేకించి దక్షిణ మధ్య రైల్వేతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ మిలింద్ సోహన్ అన్నారు. రైల్వేను పటిష్ఠ పరిచేందుకు కృత్రిమ మేథస్సు, సమాచార విశ్లేషణను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సహకార ఒప్పందం 12 నెలలపాటు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'జీహెచ్ఎంసీ ఎన్నికల పోటీ నిబంధనలపై వివరణ ఇవ్వండి'