ఉమ్మడి మెదక్ జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న తెరాస నేత, మాజీ జర్నలిస్ట్, నక్సలైట్ పక్షపాతి సోలిపేట రామలింగారెడ్డికి అభిమానులు, కర్యకర్తలు కడసారి వీడ్కోలు పలికారు. అశేష జనసందోహం, అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ రామలింగారెడ్డి అంతిమయాత్ర సాగింది. స్వగ్రామం చిట్టాపూర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్ భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పార్టీలకు అతీతంగా నివాళులు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రామలింగారెడ్డి భౌతికకాయానికి పార్టీలకు అతీతంగా నాయకులు నివాళులు అర్పించారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్. అజయ్ కుమార్, సత్యవతి రాఠోడ్ రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వీరితో పాటు పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆయనకు అంజలి ఘటించారు.
సహచరుని పాడే మోసిన హరీశ్‌రావు..
ఉద్యమ సమయం నుంచి తనకు అన్నింటా అండగా ఉండే రామలింగారెడ్డి మరణం పట్ల మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తను అప్యాయంగా లింగన్న అని పిలుచుకునే వ్యక్తి ఇక లేడని భావోద్వేగానికి గురయ్యాడు. భౌతికకాయం హైదరాబాద్ నుంచి చిట్టాపూర్ తీసుకురావడం, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు హరీశ్‌రావు రామలింగారెడ్డి భౌతికకాయంతోనే ఉన్నారు. దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేయించారు. తమ సహచరుని పాడే మోసి.. కడసారి వీడ్కోలు పలికారు.
రామలింగారెడ్డి అమర్ రహే అంటూ అభిమానుల నినాదాలు, పోలీసుల గౌరవ వందనం మధ్య ఆయన కుమారుడు సతీశ్‌రెడ్డి చితికి నిప్పు అంటించి.. అంత్యక్రియలు పూర్తి చేశారు.
అనారోగ్యం కారణంగా 15 రోజుల క్రితం రామలింగారెడ్డి కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అది ఇన్‌ఫెక్షన్ కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని మరో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్